Summer Crops : వేసవిలో ఆరుతడి పంటల సాగు

మార్కెట్‌లో ఉన్న పరిస్థితులపై రైతులకు కల్పించిన అవగాహనతో గ్రామాల్లో వేరుశనగ, ఆముదం, పెసర, మినుములు, శనగ, మొక్కజొన్న, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, ఉలవలు, జొన్న, నువ్వుల్లాంటి పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Summer Crops : వేసవిలో ఆరుతడి పంటల సాగు

Vesangi Sagu

Summer Crops : తక్కువ సమయంలో ఎక్కువ లాభాలకు చిరునామా ఆరుతడి పంటలు. ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు, ఇతర ఖర్చులతో వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలను సాగు చేయడం మేలు. మార్కెట్‌కు అనుగుణంగా సాగు చేయడంతో రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతులకు ఈ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచిస్తున్నాయి. ఈక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే మార్కెట్‌లో ఉన్న పరిస్థితులపై రైతులకు కల్పించిన అవగాహనతో గ్రామాల్లో వేరుశనగ, ఆముదం, పెసర, మినుములు, శనగ, మొక్కజొన్న, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, ఉలవలు, జొన్న, నువ్వుల్లాంటి పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పంటలు 100నుంచి 150రోజుల్లోనే చేతికి వచ్చే అవకాశం ఉంది. ఎరువులు, నీటి వినియోగం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పంటలతో నేల భూసారం పెరుగుతుంది. అంతర, మిశ్రమ పంటలుగానూ సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ పంటలకు అధిగ డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపై దృష్టి సారించటం వల్ల అదనపు అదాయాన్ని సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

సాగుకు అనువైన ఆరుతడి పంటలు;…

నువ్వులు; నువ్వు పంట జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చు ,శ్వేత,హిమ,రాజేశ్వరి అనే తెల్లగింజ రకాలు,చందన,ఎలమంచిలి,గౌరి అనే గోధుమ రంగు,గింజ రకాలు సాగుకు అనుకూలం. పైరకాలు సుమారుగా 80 నుండి 90 రోజులలో పంట పూర్తిగా అవుతుంది. ఎకరానికి 2.5 కిలోల విత్తనంతో వరుసల మధ్య 30 సెం.మీ మరియు మొక్కల మధ్య 10 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. 1 కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్ మరియు 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ తో విత్తనశుద్ది చేసుకోవాలి .విత్తిన వెంటనే గాని లేదా 48 గంటలలో ఎకరానికి 1 లీటరు పెండిమిథాలిన్ కలుపు మందును పిచికారి చేసుకోవాలి.ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ,15 కిలోల పోటాష్ మరియు 25 కిలోల యూరియాపై పాటుగా వేసుకోవాలి. చీడపీడల ఉదృతిని బట్టి సరైన సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే ఎకరానికి 3 కిలోల నుండి 4 క్వింటాళ్ళ దిగుబడితో లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు.

కొర్ర: కొర్ర పంట జనవరి 1 నుండి 30 లోపు విత్తుకోవాలి. కొర్రలో సూర్యనంది,81ఎ,3156 ,81ఎ 3085 అనువైన రకాలుగా చెప్పవచ్చు. ఎకరానికి 2 కిలోల విత్తనాన్ని వరుసల మధ్య 22.5 సెం.మీ మరియు మొక్కల మధ్య 7.5 సెం.మీ ఉండేలా విత్తుకోవాలి ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 20 కిలోల యూరియా వేసుకోవాలి.విత్తిన 30 రోజులకు ఎకరానికి 20 కిలోల యూరియా పై పాటుగా వేసుకోవాలి.

జొన్న: జొన్న పంట జనవరి 1 నుండి 30 వరకు విత్తుకొవచ్చు. ఎకరానికి 3 నుండి 4 కిలోల విత్తనంతో వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 15 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి 1 కిలో విత్తనానికి 3గ్రాముల థయోమిథాక్సాం 70% డబ్ల్యు .ఎస్ లేదా 12మి.లీ ఇమిడాక్లోప్రిడ్ తో విత్తనశుద్ది చేసుకోవాలి. విత్తిన వెంటనే గాని లేదా 48 గంటల లోపు ఎకరానికి 800 గ్రాముల అట్రజిన్ 50% పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి ఎకరానికి 50 కిలోల డి.ఎ.పి ,100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 25 కిలోల పొటాష్ ను దుక్కిలో వేసుకోవాలి. విత్తిన 30 రోజులకు ఎకరానికి 40 కిలోల యూరియా పై పాటుగా వేసుకోవాలి అవసరాన్ని బట్టి సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.

సజ్జ; ఈ పంట జనవరి 1 నుండి 30 వరకు విత్తుకోవచ్చు. పి.హెచ్.బి-3 అనె రకం 80 నుండి 85 రోజులలో పంటకాలం పూర్తి చేసుకొని ఎకరానికి 10 నుండి 12 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది ఎకరా నికి 2 కిలోల విత్తనంతో వరుసల మధ్య 45 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి విత్తిన వెంటనే గాని 48 గంటలలోపు ఎకరానికి 600గ్రాముల అట్రజిన్ 50% పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారి చేసుకోవాలి ఎకరానికి 30 కిలోల యూరియా ,100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్,20 కిలోల పోటాష్ లు దుక్కిలో వేసుకొవాలి. విత్తిన 30 రోజులకు ఎకరానికి 40 కిలోల యూరియా పై పాటుగా వేసుకోవాలి.

రాగి; రాగి పంట జనవరి 15 నుండి ఫిబ్రవరి 5 లోపు విత్తుకోవాలి. భారతి .శ్రీచైతన్య,వకుళ .మారుతి అనువైన రకాలు ఎకరానికి 2 కిలోల విత్తనం నారు పోసి కాని లేదా నేరుగా గాని వరుసల మధ్య 30 సెం,మీ మరియు మొక్కల మధ్య 10 సెం,మీ ఉండేలా చూసుకోవాలి. విత్తనాన్ని 2 గ్రాముల కార్బండిజం తో విత్తనశుద్ది చేసుకోవాలి ,విత్తే ముందు ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు 25 కిలోల డి.ఎ.పి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు విత్తిన నెలకు 25 కిలోల యూరియా వేసుకోవాలి, నారు నాటే ముందు.లేదా విత్తనం వేసే ముందు పెండిమిథాలిన్ మందును 3 మి.లీ/లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. పిలకలు వేసే దశ,పూతదశ,గింజలు పాలు పోసుకునే దశలో నీటితడులు తప్పని సరిగా ఇవ్వాలి. గులాబిరంగు పురుగు నివారణకు క్లోరోఫైరిఫాస్. 2.5మి.లీ/లీ మరియు అగ్గితెగుళ్ళ నివారణకు 1గ్రాం. కార్బండిజం లేదా 1గ్రాం ఏథిఫెన్ ఫాస్ 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మొక్కజొన్న; ఎర్ర రేగడి, నల్లరేగడి నేలల్లోనూ పండుతుంది. హైబ్రిడ్‌, ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన పలు రకాల విత్తనాలను నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు విత్తుకోవచ్చు. ఇవి ఎకరాకు కిలో అవసరమవుతాయి. మొక్క జొన్న పంటను డిసెంబర్‌ వరకూ విత్తుకోవచ్చు. నల్ల, ఎర్ర, ఇసుక, దుబ్బ నేలల్లోనూ ఈ పంటను సాగు చేయవచ్చు. ప్రభుత్వం ఈ పంటకు రూ.2,758మద్దతు ధర కల్పించింది.

ఆవాలు; నల్లరేగడి నేలల్లో ఈ పంట పండుతుంది. పూస అగ్రాని, పూస మహాక్‌, వరుణ, నరేంద్ర, అగేతితో పాటు ఇతర ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన విత్తనాలు మార్కెట్‌లో ఉన్నాయి. నవంబర్‌ రెండో వారం వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 2నుంచి 2.50కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఈ పంట 120-125రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరాకు 6-8క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ఈ పంటకు రూ.5,050 మద్దతు ధర ఉంది.

పొద్దుతిరుగుడు; ఎర్ర, నల్లరేగడి నేలల్లోనూ ఈ పంట మంచి దిగుబడి వస్తుంది. నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 2.50కిలోల నుంచి 30కిలోల విత్తనాలు కావాల్సి ఉంటుంది. దీనికిగానూ కే.బి.ఎస్‌.హెచ్‌ 44, ఎన్‌.డి.ఎస్‌.హెచ్‌1, డీఆర్‌ఎస్‌హెచ్‌1రకాల విత్తనాలు మంచిగా ఉంటాయి. ఈ పంట కేవలం 9నుంచి 95రోజుల్లోనే చేతికి వస్తుంది. ఎకరాకు రూ.10వేల పెట్టుబడి పెడితే 6-7క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం రూ.6,015చొప్పున మద్దతు ధర కల్పించింది. యాసంగి, వేసవి సీజన్లలో కొద్దిపాటి నీళ్లతోనే ఈ పంట పండుతుంది.

కంది; ఈ పంటకు నల్లరేగడి, ఎర్ర చెల్క నేలలు అనుకూలం. ఈ పంట 120-130రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు రూ.15వేల పెట్టుబడి పెడితే రూ.7నుంచి 8క్వింటాళ్లు వస్తుంది. ప్రభుత్వం ఈ పంటకు రూ.6,300చొప్పున మద్దతు ధర ప్రకటించింది.

పెసర; నీటి సౌకర్యంతో ఎర్ర, నల్లరేగడి నేలల్లో వరి మాగాణుల్లో నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు డబ్ల్యూజి.జి.-42,37ఎం.జి.జి. 295, 347, 752, 787, పి.యు 31రకాల 6కిలోల విత్తనాలు వేసుకోవచ్చు. ఇక ఈ పంట అతి స్వల్ప కాలిక పంటగా చెప్పవచ్చు. ఎకరాకు కేవలం రూ.10వేల పెట్టుబడులు ఉన్న ఈ పంట 60నుంచి 70రోజుల్లోనే చేతికి వస్తుంది. ఇక దిగుబడి మాత్రం 5నుంచి 6క్వింటాళ్లు వస్తుంది. ప్రభుత్వం రూ.7,275చొప్పున మద్దతు ధర కల్పించింది.

వేరుశనగ; నీటి సౌకర్యం కలిగిన ఎర్ర నేలల్లో సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ రెండో వారం వరకు విత్తనాలు వేసుకోవచ్చు. కదిరి6-9, టీఏజీ-24, కదిరి 1818(లేపాక్షి) విత్తనాలు ఎకరాకు 60నుంచి 80కిలోలు అవసరమవుతాయి. ఈ పంట 100నుంచి 105రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 10నుంచి 14క్వింటాళ్ల దిగబడి వస్తుంది. ఈ పంటకు ఎకరాకు రూ.12వేల వరకు ఖర్చు వస్తుంది. ప్రభుత్వం రూ.5,230మద్దతు ధర కల్పించింది.

శనగ; వర్షాధార నల్ల రేగడి, తేమ పట్టి ఉంచే నేలల్లో ఈ పంట సాగు చేయవచ్చు. నవంబర్‌ మొదటి, రెండో వారంలోపు విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది. దేశవాళీ విత్తనాలైతే ఎకరాకు 25నుంచి 30కిలోలు, ఇందులో జె.జి. 11,130, జే.ఏ.కె.ఐ. 9218, ఐ.సి.సి.ఐ 37, నంద్యాల శనగ 1.47 విత్తనాలు ఉన్నాయి. ఇక కాబూళీ రకాలైన కె.ఎ.కె.-2, పూలే జి.95311 మరియు ఐ.సి.సి.వి.-2రకాల విత్తనాలు 45నుంచి 60కిలోలు అవసరమవుతాయి. ఈ పంట 90-110రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరాకు రూ.10వేల పెట్టుబడులు అవసరమవుతాయి. దీనివల్ల 8-1క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో రూ.5,230గిట్టుబాటు ధర కల్పించబడింది.

కుసుమలు; శీతాకాలంలో అనువైన ఈ పంటను ఈనెల మొదటి వారం వరకు విత్తుకోవాల్సి ఉంటుంది. మంజీరా టీ.ఎస్‌.ఎఫ్‌-1, నారి-6, పి.బి.ఎన్‌.ఎస్‌12, జె.ఎస్‌.ఎఫ్‌ 414, డి.ఎస్‌.హెచ్‌.185 రకాల విత్తనాలను ఎకరాకు 4కిలో వరకు విత్తనాలు అవసరమవుతాయి. ఈ పంట 125-130 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు రూ.10వేల పెట్టుబడులు మాత్రమే ఉంటాయి. ఇక దిగుబడి 4నుంచి 8క్వింటాళ్లవరకు వస్తుంది. ప్రభుత్వం క్వింటాకు రూ.5,441మద్దతు ధర కల్పించింది.