Revanth Reddy : నిర్లక్ష్యం వద్దు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. ఉప ఎన్నికల విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యంకూడా ఉండొద్దని సూచించారు.
Revanth Reddy
Revanth Reddy : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ లోని ఎంపీ కార్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్, అందుబాటులో ఉన్న మంత్రులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యంకూడా ఉండొద్దని సూచించారు. అందరూ కలిసికట్టుగా ప్రచారంలో పాల్గొనాలని, మూడు రోజుల్లో మంత్రులు, పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గెలుపుకోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి గత నెల 31 నుంచి ఈనెల 1, 4, 5 తేదీల్లో నియోజకవర్గంలో పలు డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు నిర్వహించారు. అయితే, తాజాగా.. క్షేత్ర స్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. అయితే, తాజా సమావేశంలో పోలింగ్ సమయం వరకు పార్టీ వ్యూహ, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సమీక్ష చేసినట్లు తెలిసింది.
