Assembly Elections : పంజాబ్‌లో కాంగ్రెస్‌కి ఇజ్జత్‌కా సవాల్

ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఇక ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దేశప్రజలందరి దృష్టినీ ఆకర్షిస్తూ తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్న రాష్ట్రం పంజాబ్.

Assembly Elections : పంజాబ్‌లో కాంగ్రెస్‌కి ఇజ్జత్‌కా సవాల్

Assembly Elections

Assembly Elections : ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. శనివారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర.. ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఇక ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దేశప్రజలందరి దృష్టినీ ఆకర్షిస్తూ తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్న రాష్ట్రం పంజాబ్. ఈ ఎన్నికల్లో గెలుపు బీజేపీకి అత్యవసరం. ఏడాదిపాటు అలుపెరగకుండా పోరాటం సాగించి.. అన్నదాత పట్టుదలను, శక్తిని, సామర్థ్యాన్ని యావత్ ప్రపంచానికీ చాటి చెప్పిన రైతుపోరాటంలో ప్రధాన పాత్ర పంజాబ్ రైతులదే. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్న ప్రచారమూ ఉంది.

చదవండి : Five States Elections 2022 : మోగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా.. ముఖ్య తేదీలు ఇవే

పంజాబ్ ఎన్నికల్లో గెలిచి.. రైతులు తమపై వ్యతిరేకంగా లేరని చాటిచెప్పాలని బీజేపీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్‌ పాలనలో ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. రైతు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి కేంద్రం మెడలు వంచడానికి సహకరించిన కాంగ్రెస్‌కు రైతులు ఓట్ల వర్షం కురిపిస్తారన్న భావనలో ఉన్నారు హస్తం నేతలు. అమరీందర్ సింగ్ రాజీనామా, కాంగ్రెస్ మార్క్ అంతర్గత రాజకీయాలు వంటి పరిస్థితులను తట్టుకుని.. విజయం సాధించడం.. ఆ పార్టీకి సవాల్‌గా మారింది. ఓ రకంగా కాంగ్రెస్‌కు ఇది జీవన్మరణ సమస్య. పంజాబ్ ఎన్నికల్లో గెలవలేకపోతే.. కాంగ్రెస్ స్థితి మరింతగా దిగజారుతుంది.

చదవండి : Uttar Pradesh Elections 2022 : అధికారం కోసం అఖిలేష్… పదవి నిలబెట్టుకునేందుకు యోగి యత్నాలు

మొత్తం ఆ రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 59 స్థానాలు కావాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 80 స్థానాలు, ఆప్‌కు 17, బీజేపీకి రెండు స్థానాలున్నాయి. మిగిలిన వాటిలో ఇతరులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రైతుఉద్యమం, ఇటీవల స్వర్ణదేవాలయంలో గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కొట్టిచంపడం, లూథియానా పేలుళ్లు ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ఇక పంజాబ్ ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైన ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది.

 

మొత్తం అసెంబ్లీ స్థానాలు 117
మ్యాజిక్ ఫిగర్ 59
ప్రస్తుతం కాంగ్రెస్‌కు 80 సీట్లు
ఆప్‌ -17
బీజేపీ -2