Equality Statue : తిరునామం, పంచెకట్టుతో మోదీ.. మురిసిపోయిన ముచ్చింతల్

శ్రీరామనగరానికి వచ్చిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన విశ్వక్సేనేష్టి యాగంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Equality Statue : తిరునామం, పంచెకట్టుతో మోదీ.. మురిసిపోయిన ముచ్చింతల్

Modi

Narendra Modi Visit Muchintal : ముచ్చింతల్‌ మురిసిపోయింది. శ్రీరామ నగరం దివ్యక్షేత్రంగా మెరిసిపోయింది. సమతా స్ఫూర్తికి నిలువెత్తు రూపమైన రామానుజుల ముకులిత హస్తాల దివ్యరూపం.. లోకార్పణం జరిగింది. వసంత పంచమి సందర్భంగా ప్రధాని మోదీ.. రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. సమాజానికి రాజానుజాచార్యుల సూత్రాలే ఆదర్శం అని కొనియాడారు. సమతా సూత్రాన్ని లోకానికి అందించిన శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కులం, మతం, విశ్వాసాల్లో నిజమైన సమానత్వాన్ని ప్రోత్సాహించాలన్న శ్రీరామానుజ బోధనలు స్మరించుకుంటూ… 216 అడుగులు ఎత్తైనా సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోకార్పణ చేశారు.

108 దివ్య దేశాలు :-
జగద్గురు శ్రీ రామానుజాచార్య భారీ దివ్య రూప విగ్రహం ద్వారా భారతదేశం మానవ శక్తిని, స్ఫూర్తిని పొందుతోందని అన్నారు. గురువు వల్లే మనిషి జ్ఞానం వికసిస్తుందన్నారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీకగా ప్రధాని పేర్కొన్నారు. రామానుజుడు 11వ శతాబ్దం లోనే మానవ కళ్యాణం గురించి ఆలోచించారన్నారు. రామానుజాచార్య విగ్రహం ఆయన జ్ఞానం, నిర్లిప్తత, ఆదర్శాలకు చిహ్నమని పేర్కొన్నారు. సమాజంలో కులం కన్నా గుణం గొప్పదని చాటిన మహోన్నత వ్యక్తి రామానుజాచార్య అన్నారు ప్రధాని మోదీ. 108 దివ్యదేశ మందిరాల ఏర్పాటు అద్భుత‌మ‌ని మోదీ ప్రశంసించారు. దేశ‌మంతా తిరిగి ఆల‌యాలు చూసిన అనుభూతి క‌లిగిందన్నారు. చిన్నజీయ‌ర్ స్వామి త‌న‌తో విష్వక్సేనేష్ఠి య‌జ్ఞం చేయించారన్న మోదీ.. ఈ య‌జ్ఞ ఫలం 130 కోట్ల మంది ప్రజ‌ల‌కు అందాల‌న్నారు.

విశ్వక్సేనేష్టి యాగంలో మోదీ :-
తెలుగు సంస్కృతి, సినిమాలను కూడా కొనియాడారు మోదీ. తెలుగు సంస్కృతి పరంపరను తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ గౌరవంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా విస్తరిస్తోందని అన్నారు. తెలుగువాళ్ల కళ, సంస్కృతి అందరికి ప్రేరణనిస్తోందని ప్రశంసించారు. శ్రీరామానుజాచార్యుల స్ఫూర్తితో ప్రజలంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. మనుషులంతా ఒక్కటేనని రామానుజార్యులు బోధించారని గుర్తుచేశారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఏర్పాటు చేశారని కొనియాడారు. ముందుగా శ్రీరామనగరానికి వచ్చిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన విశ్వక్సేనేష్టి యాగంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో ప్రధానికి.. చినజీయర్ స్వామి స్వర్ణ కంకణం కట్టారు. మోదీకి పండితులు ఆశీర్వచ‌నం అందించారు. అనంత‌రం యాగ‌శాల చుట్టూ మోదీ ప్రద‌క్షిణ‌లు చేశారు. తిరునామంతో సంప్రదాయ దుస్తుల్లో మోదీ యాగంలో పాల్గొన్నారు.

5వేల మంది రుత్విజులు మోదీకి ఆశీర్వచనం :-
స‌మ‌తామూర్తి విగ్రహావిష్కర‌ణ‌ కంటే ముందు 45 ఎకరాల సువిశాల ప్రాంగణంలోని 108 దివ్య దేశాల‌ను మోదీ సంద‌ర్శించారు. మోదీకి చిన్నజీయ‌ర్ స్వామి దివ్య దేశాల విశిష్టత‌ను వివ‌రించారు. ఒక్కో దివ్యదేశం వద్దకు వెళ్లిన మోదీ… ఆ దివ్యదేశం ప్రాముఖ్యతను డిజిటల్‌ గైడ్‌ ద్వారా విన్నారు. అనంతరం భద్రవేదిని సందర్శించారు మోదీ. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామితో కలిసి సమతామూర్తి ప్రాంగణంలో కలిగి తిరిగిన మోదీ… భద్రవేదిని సందర్శించారు. విగ్రహావిష్కరణ అనంతరం రామానుజాచార్య జీవిత చరిత్రను, స్ఫూర్తి సూత్రాలను త్రీడీ మ్యాపింగ్‌ ద్వారా ప్రదర్శించారు. దీన్ని ప్రధాని మోదీ తిలకించారు. అనంతరం యాగంలో పాల్గొంటున్న 5వేల మంది రుత్విజులు మోదీకి ఆశీర్వచనం అందించారు. సమతామూర్తి కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎల్‌ఈడీ దీపాల కాంతుల్లో కేంద్రం, యాగశాలలు శోభాయమానంగా దర్శనమిచ్చాయి. ప్రత్యేకంగా బెంగళూరుతోపాటు విదేశాల నుంచి తెప్పించిన వందకు పైగా రకాల పుష్పాలతో కేంద్రాన్ని అందంగా అలంకరించారు.