Annavaram : వరాల దేవుడు… అన్నవరం సత్యదేవుడు

ప్రతిరోజు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. వివాహాది శుభకార్యక్రమాలను సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తుంటారు.

Annavaram : వరాల దేవుడు… అన్నవరం సత్యదేవుడు

Annavaram (5)

Annavaram : పిలిస్తే పలికే దైవంగా, వరాలు ఇచ్చే స్వామిగా అన్నవరం సత్యన్నారాయణ స్వామిని భక్తులు కొలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని శంఖవరం మండలం అన్నవరంలో రత్నగిరి కొండపై ఈ ఆలయం ఉంది. ఒకే పీఠంపై శివ, కేశవులు, అనంత లక్ష్మీ అమ్మవారు ఈ ఆలయంలో భక్తులకు దర్శన మిస్తారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.

స్ధలాపురణం విషయానికి వస్తే పర్వత శ్రేష్టులలో ఒకరైన మేరు పర్వతం ఆయన సతీమణి మేనక ఇద్దరూ కలసి సంతానంకోసం విష్ణువు ప్రసన్నం కోసం తపస్సు చేస్తారు. మహా విష్ణువు అనుగ్రహంతో ఇద్దరుకొడుకులను పర్వతాలుగా పొందుతారు. వారిలో ఒకరు భడ్రుడు, మరొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తికోసం తపస్సు చేసి శ్రీరాముని నివాసస్ధానమైన భద్రాచలంగా మారగా, రత్నకుడు వీర వెంకట సత్యన్నారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండగా మారతారు. అందుకే రత్నగిరి కొండపై స్వామి వెలిశాడని పురాణాలు చెప్తాయి.

ఆలయ నిర్మాణం వెనుక పెద్ద చరిత్ర ఉంది. పిఠాపురానికి చెందిన గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకటరామారాయణిం బహద్దూర్ వారికి కలలో కనబడి శ్రావణ శుక్ల విధియా మకా నక్షత్రంలో రత్నగిరి కొండపై వెలుస్తున్నట్లు చెప్పటంతో ప్రకాశరావు అనే బ్రహ్మణోత్తమునితో కలసి రాజావారు కొండపైకి వెళతారట. అంకుడు చెట్ట పొదవద్ద సూర్యకిరణాలు స్వామి వారి పాదలపై పడటంతో అక్కడ ఉన్న పొదను తొలగించి స్వామి వారి విగ్రహాన్ని పైకి తీసుకువచ్చి 1891లో రత్నగిరి కొండపై ప్రతిష్టించారు. 1934లో ఆలయాన్ని నిర్మించారు.

అన్నవరం సత్యన్నారాయణస్వామి దేవాలయంలో స్వామి వారిని రెండు అంతస్థులలో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్థులో స్వామివారి మూడలస్ధంభం, పాదాలు దర్శించుకుని, మెట్లపైగా పై అంతస్థులో సత్యన్నారాయణ స్వామి, మహేశ్వరుడు, అనంత లక్మీ అమ్మవారు ఒకే పీఠంపై భక్తులకు దర్శనమిస్తారు.

ప్రతిరోజు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. వివాహాది శుభకార్యక్రమాలను సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తుంటారు. కొత్త వివాహమైన వారు ఇక్కడి వచ్చి సత్యన్నారాయణ స్వామి వత్రం చేసుకోవటం అనాదిగా సాంప్రదాయంగా వస్తుంది. ప్రతినిత్యం సత్యదేవవ్రతాలు, నిత్యకళ్యాణాలు స్వామి సన్నిధానంలోనే జరుగుతాయి. ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు సత్యన్నారాయణ స్వామి వ్రతాలు కొనసాగుతాయి.

అన్నవరంలో సత్యన్నారాయణ స్వామి ప్రసాదం చాలా విశేషమైనది. ఇక్కడకు వచ్చిన వారు తిరిగి వెళ్ళేసమయంలో తప్పనిసరిగా స్వామి వారి ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళుతుంటారు. సువాసన భరిత మైన ఈ ప్రసాదాన్ని ఎర్రగోధుమ నూక, బెల్లం, పంచదారల కలగలిపి తయారు చేస్తారు. చిన్నసైజు విస్తరాకు ప్రసాదాన్ని ఉంచి భక్తులకు అందిస్తారు. 150 గ్రాముల పరిమాణంలో ఉండే ఈ ప్రసాదం ధర 20 రూపాయలు.

దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకోసం సౌకర్యవంతంగా కాటేజిలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే నూతనంగా వివాహాలు చేసుకునే వారికోసం అతిపెద్ద కళ్యాణమండపాన్ని నిర్మించారు. ఈ కళ్యాణమండపాన్ని వివాహాలు చేసుకునే వారికి ఉచితంగా ఇస్తున్నారు. కోరిన వెంటనే వరాలు ఇచ్చే దేవునిగా కీర్తించబడే అన్నవరం సత్యన్నారాయణ స్వామిని జీవితంలో ఒక్కసారైన దర్శించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటారు.