Supreme Court : చరిత్ర సృష్టించిన ముగ్గురు మ‌హిళా జ‌డ్జిల గురించి తెలుసుకోండి

సుప్రీంకోర్టు చరిత్రలోనే అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. అదే ఒకేసారి తొమ్మిదిమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయగా వారిలో ముగ్గురు మహిళా జడ్జీలు ప్రమాణం చేయటం విశేషం.

Supreme Court : చరిత్ర సృష్టించిన ముగ్గురు మ‌హిళా జ‌డ్జిల గురించి తెలుసుకోండి

Historic Moment As Three Women Take Oath As Supreme Court Judges

three women take oath as supreme court judges : సుప్రీంకోర్టు చరిత్రలోనే ఈరోజు ఒక అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. అదే ఒకేసారి తొమ్మిదిమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉంటే మరో అద్భుతమైన ఘట్టం ఏమిటంటే ఈ తొమ్మిదిమంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మహిళే కావటం. ఇది చరిత్రలో నిలిచిపోయే చ‌రిత్రాత్మ‌కం అని చెప్పాల్సిందే. మొత్తం 9 మంది సుప్రీంకోర్టు జ‌డ్జిలుగా మంగళవారం (ఆగస్టు 31.8.2021) ప్ర‌మాణం చేసిన విష‌యం తెలిసిందే. వీరిలో ముగ్గురు మహిళా జ‌డ్జీలుగా జ‌స్టిస్ హిమా కోహ్లీ, జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న, జ‌స్టిస్ బెలా ఎం త్రివేదిలు ఉన్నారు. ఈ ముగ్గురి చేరిక‌తో సుప్రీంకోర్టులో మ‌హిళా న్యాయ‌మూర్తుల సంఖ్య నాలుగుకు పెరిగింది. సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది జ‌డ్జీలు ఉన్నారు. ఇప్ప‌టి వ‌రకు సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో మ‌హిళా జ‌డ్జీలుగా 11 మంది ప‌ని చేయటం గమనించాల్సిన విషయం.

జస్టిస్ హిమా కోహ్లీ
తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ఉన్న జ‌స్టిస్ హిమా కోహ్లీకి సుప్రీంకోర్టు జ‌డ్జీగా ప‌దోన్న‌తి సాధించారు. 2006లో ఢిల్లీ హైకోర్టు అడిష‌న‌ల్ జ‌డ్జిగా ఆమె బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌స్టిస్ హిమా కోహ్లీ ఆ త‌రువాత సంవత్సరం ప‌ర్మ‌నెంట్ న్యాయమూర్తి అయ్యారు. 2021 జ‌న‌వ‌రిలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈక్రమంలో పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన హిమా కోహ్లీ 2024, సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు న్యాయ‌మూర్తిగా కొనసాగనున్నారు.

జ‌స్టిస్ బీవీ నాగ‌రత్న
భార‌త మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఈఎస్ వెంక‌ట‌రామ‌య్య కుమార్తె జ‌స్టిస్ బీవీ నాగ‌రత్న. క‌ర్నాట‌క హైకోర్టు సీజేగా ఉన్న ఆమె నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో అన్నీ అనుకూలిస్తే 2027లో బీవీ నాగరత్న భార‌త తొలి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌వేళ ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించినా.. కేవ‌లం 36 రోజులు మాత్ర‌మే ఆ విధుల్లో కొన‌సాగే అవ‌కాశం ఉంది.

జ‌స్టిస్ బెలా ఎం త్రివేది
గుజ‌రాత్ హైకోర్టుకు చెందిన‌ జ‌స్టిస్ బెలా ఎం త్రివేది.. సుప్రీంకోర్టు జ‌డ్జిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 2011లో రాజ‌స్థాన్ హైకోర్టు అడిష‌న‌ల్ జ‌డ్జిగా ఆమె బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2016లో ఆమె మ‌ళ్లీ గుజ‌రాత్ హైకోర్టుకు బ‌దిలీ అయ్యారు. 2003 నుంచి 2006 వ‌ర‌కు గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి న్యాయ కార్య‌ద‌ర్శిగా చేశారు. 2025, జూన్ 10 వ‌ర‌కు జ‌స్టిస్ బెలా త్రివేది సుప్రీం జ‌డ్జీగా ఉంటారు.

ఇలా ముగ్గురు మహిళలు న్యాయమూర్తులుగా ఒకేసారి ప్రమాణం చేయటం సుప్రీంకోర్టు చరిత్రలో అత్యంత చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. కాగా..ఏపీకి చెందిన పీఎస్‌ నరసింహా న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం జడ్జిగా నియమితులు కావటం మరో విశేషమని చెప్పాలి. అయోధ్య సహా పలు సంచలన, కీలక కేసుల్లో నరసింహా తన వాదనలు వినిపించారు.

ఆ తొమ్మిదిమంది న్యాయమూర్తులు వీరే..
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా త్రివేది సహా.. జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.

వాస్తవానికి 1956లో తీసుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి 2009లో సవరణలు తీసుకుని వచ్చారు. అప్పుడు సీజేఐతో కాకుండా న్యాయమూర్తుల సంఖ్యను 25 నుంచి 30కి పెంచారు. న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే కేబినెట్ నుంచి అప్పట్లో నిర్ణయం వచ్చిన తరుణంలో ఈరోజు తొమ్మిదిమంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణం చేశారు.