Etala Rajender : ఏడోసారి గురితప్పని ఈటె.. అపజయం ఎరుగని రాజేందర్!

ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈటల విజయం సాధించారు. అనుభవజ్ఞులకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ వేసుకున్నారు.

Etala Rajender : ఏడోసారి గురితప్పని ఈటె.. అపజయం ఎరుగని రాజేందర్!

Tg Hzb

BJP Candidate Etela Rajender Win : ఈటల రాజేందర్‌.. తెలంగాణలో అందరికి సుపరిచితమైన పేరు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1964 మార్చి 20న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈటల రాజేందర్‌ జన్మించారు. బీఎస్సీ వరకు చదివారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష సంఘాలలో చురుగ్గా పనిచేశారు. డిగ్రీ పూర్తయ్యాక పౌల్ట్రీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమం వైపు ఆకర్షితులై… కేసీఆర్ నడిపిన మలిదశ ఉద్యమంలో తన గొంతు కలిపారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దారు.

Read More : Huzurabad : బండి సంజయ్‌‌కు అమిత్ షా ఫోన్

2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం జరగడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఈట‌ల రాజేంద‌ర్ ఆక‌ర్శితుల‌య్యారు. 2004 ఎన్నిక‌ల ముందు టిఆర్ఎస్‌లో చేరిన ఆయ‌న‌… ఆ ఎన్నిక‌ల్లో క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటిచేశారు. మాజీ మంత్రి‌, ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ తర్వాత 2008 బై ఎలక్షన్‌లోనూ మరోసారి ముద్దసాని దామోదర్‌రెడ్డి ఓడించారు.
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్‌.. హుజూరాబాద్‌గా మారింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణా మోహన్‌రావుపై ఈటల విజయం సాధించారు. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ముద్దసానిని ఓడించారు ఈటల.

Read More : Huzurabad By Poll : 13వ రౌండ్‌‌లో ఈటల ముందంజ…ఏ రౌండ్‌‌లో ఎన్ని ఓట్లు

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై 57 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ తొలి ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డిపై 40 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచి, డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 2004 నుంచి నాలుగు సాధారణ ఎన్నికల్లో.. రెండుసార్లు ఉప ఎన్నికల్లో విజయ దుందుబి మోగించారు. అయితే…మంత్రి పదవిలో ఉన్న ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో..ఆయనపై విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేగాకుండా..మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. దీంతో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈటల విజయం సాధించారు. అయితే..టీఆర్ఎస్ పార్టీ తరపున కాకుండా..బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అనుభవజ్ఞులకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ వేసుకున్నారు.