Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
భారత్ లో జూన్ నాటికి కరోనా నాలుగో దశ వ్యాప్తి మొదలయ్యే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ కు చెందిన మ్యాథమెటిక్స్ అండ్ స్టాస్టిక్స్ విభాగం పేర్కొంది.

Kanpur
Covid-19 Fourth Wave: కరోనా మహమ్మారి పీడ ఇప్పట్లో తొలగేలా లేదు. దశల వారీగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి..కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై పడగవిప్పుతూనే ఉంది. గత మూడేళ్ళుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి ప్రజ్జాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. ఈక్రమంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన కలిగిస్తుంది. భారత్ లో 2022 జూన్ 22 నాటికి కరోనా నాలుగో దశ వ్యాప్తి మొదలయ్యే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ కు చెందిన మ్యాథమెటిక్స్ అండ్ స్టాస్టిక్స్ విభాగం పేర్కొంది. కరోనా మొదలైన నాటి నుంచి కాలానుగుణంగా అది చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసి.. పలు విషయాలని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు.
ఐఐటీ కాన్పూర్ కి చెందిన సబర పర్షద్ రాజేష్‌భాయ్, సుభ్రా శంకర్ ధర్, మరియు శలభ్ అనే బృందం జరిపిన ఈ అధ్యయనంలో కరోనా నాలుగో దశ గురించి కొన్ని అంచనాలు నెలకొన్నట్లు తెలిపారు. కరోనా పై మొదట లభించిన డేటా సమయం(జనవరి 30, 2020)నాటి నుంచి 936 రోజుల తర్వాత భారత్ లో కోవిడ్-19 నాల్గొవ దశ ప్రారంభం అవుతుందని వారు అంచనా వేశారు. 2022 జూన్ 22న ప్రారంభమై, ఆగస్టు 23కి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని.. అక్టోబర్ 24న ముగుస్తుందని ఇంకా ప్రచురితం కానీ ఓ నివేదికలో పేర్కొన్నారు.
Also read: AP Covid Update : ఏపీలో కొత్తగా 71 కోవిడ్ కేసులు
అయితే నాలుగో దశలో మరో కొత్త వేరియంట్ రూపంలో రానున్న కరోనా తీవ్రత ప్రజలపై ఎంతగా ఉంటుందనే విషయం మాత్రం చెప్పలేమని నివేదిక వెల్లడించింది. కొత్త వేరియంట్ యొక్క సంక్రమణ, మనుషులపై ప్రభావం, మరణాలు మొదలైన వివిధ కారకాలపై తీవ్రత ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు. జూన్ నాటికి భారత్ లో మొదటి, రెండు డోసుల వాక్సినేషన్ పూర్తయ్యి.. బూస్టర్ డోసు కూడా తీసుకుని ఉన్నట్లయితే.. నాల్గవ దశలో సంక్రమణ అవకాశం తక్కువగానే ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.