IPL 2023 : హమ్మయ్య.. హైదరాబాద్ గెలిచింది, రెండు ఓటముల తర్వాత విజయం
IPL 2023 : ఈ సీజన్ లో రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2023, SRH vs PBKS
IPL 2023 : ఐపీఎల్ 2023లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఖాతా తెరిచింది. ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ గెలుపొందింది. ఈ సీజన్ లో రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది.
144 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 17.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో రాహుల్ త్రిపాఠీ హాఫ్ సెంచరీతో జట్టుని గెలిపించాడు. త్రిపాఠి 48 బంతుల్లో 74 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో మార్ క్రమ్ 21 బంతుల్లో 37 పరుగులతో(నాటౌట్) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.(IPL 2023)
Also Read..IPL 2023: అత్యధిక సిక్సులు కొట్టిందెవరు?.. పాయింట్ల పట్టికలో ముందంజలో ఏయే జట్లు?
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఒంటరి పోరాటం చేశాడు. జట్టు సభ్యులు తనకు సహకరించకున్నా పట్టుదలతో తొలి ఓవర్ నుంచి ఆఖరి ఓవర్ వరకు బ్యాటింగ్ కొనసాగించాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
Also Read..IPL Bowling records: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీరే..
శిఖర్ ధావన్ ఒక్కడే 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తృటిలో శతకాన్ని కోల్పోయాడు. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కర్రాన్(22) మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు.(IPL 2023)
హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే 4 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కు ఓ వికెట్ లభించింది.
ఈ సీజన్ లో హైదరాబాద్ ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడింది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమి చవి చూసింది. తొలి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్, రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది. ఇక, పంజాబ్ విషయానికి వస్తే.. పంజాబ్ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సీజన్ లో వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ కి హైదరాబాద్ షాక్ ఇచ్చింది. పంజాబ్ తొలి ఓటమి రుచి చూసింది. తన తొలి మ్యాచ్ లో కోల్ కతాపై, రెండో మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై పంజాబ్ విజయం సాధించింది. మూడో మ్యాచ్ లో హైదరాబాద్ చేతిలో చిత్తైంది.
స్కోర్లు..
పంజాబ్ కింగ్స్ : 20 ఓవర్లలో 143/9
సన్ రైజర్స్ హైదరాబాద్ : 17.1 ఓవర్లలో 145/2