Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రం, ఈసీకి నోటీసులు

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గెలిచిన తర్వాత ఫ్రీగా గిఫ్ట్‌లు ఇవ్వడం.. ఉచిత పథకాలు హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రం, ఈసీకి నోటీసులు

Covid In Supreme Court..10 Judges Positive

Updated On : January 25, 2022 / 12:52 PM IST

Supreme Court: ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గెలిచిన తర్వాత ఫ్రీగా గిఫ్ట్‌లు ఇవ్వడం.. ఉచిత పథకాలు హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. ఈ విషయమై కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వానికి, కమిషన్‌కు నోటీసులు:
ప్రభుత్వ నిధులతో రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఓటర్లకు వాగ్దానాలు చేయడం.. గిఫ్ట్‌లు ఇస్తామని చెప్పడం స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పిటిషనర్ పేర్కొనగా.. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి (ఈసీ) నోటీసులు జారీ చేసింది.

ఎన్నికలకు ముందు ఓటర్లకు ప్రజా నిధుల నుంచి ఉచిత బహుమతులు ఇస్తామని, లేక ప్రలోభపెట్టేందుకు ఉచిత బహుమతులు పంపిణీ చేస్తామని చెప్పడం ఎన్నికల రంగంలో సమాన అవకాశాల సూత్రాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ పార్టీలు ఉచిత బహుమతులు ఇవ్వడం, వాగ్దానం చేయడం ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నమని, ఇది ఒక రకంగా లంచమేనని పిటిషనర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో సాధారణ ఓటర్లకు ఉచిత విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని పలు పార్టీలు హామీ ఇచ్చాయి. ప్రతి ఎన్నికల్లోనూ రైతు రుణమాఫీ పెద్ద ఎన్నికల ఎట్రాక్టివ్ హామీగా నిలుస్తోంది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటీషన్ దాఖలు చేయగా.. నాలుగు వారాల్లోగా స్పందన తెలపాలని ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను కోరింది.

అయితే ఈ పిటిషన్‌లో ఎంపిక చేసిన రాష్ట్రాలు, రాజకీయ పార్టీల ప్రస్తావనపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టీస్ ఎన్వీ రమణ. ఇది చాలా సీరియస్ అంశమని, ఉచిత హామీల బడ్జెట్ సాధారణ బడ్జెట్‌ను దాటిపోతోందని అభిప్రాయపడ్డారు.