Russia-Ukraine War: భారత సైన్యాన్ని పంపమంటూ ఏడుస్తూ రిక్వెస్ట్!

కన్నీళ్లు, ముకుళిత హస్తాలతో దేశం కాని దేశంలో మనవాళ్లు అభ్యర్ధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Russia-Ukraine War: భారత సైన్యాన్ని పంపమంటూ ఏడుస్తూ రిక్వెస్ట్!

Indian Army

Russia-Ukraine War: కన్నీళ్లు, ముకుళిత హస్తాలతో దేశం కాని దేశంలో మనవాళ్లు అభ్యర్ధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం సాగుతోండగా.. అక్కడకు చదువుకోవడానికి వెళ్లిన విద్యార్ధులు కొందరు తమకు సాయం చెయ్యాలంటూ అభ్యర్థిస్తున్నారు.

యుక్రెయిన్‌లో రష్యా సైన్యం కల్లోలం కొనసాగుతోంది. రొమేనియా, హంగేరి, పోలాండ్ మీదుగా బస్సుల ద్వారా యుక్రెయిన్ సరిహద్దు నుంచి భారతీయ విద్యార్థులను తీసుకువెళుతున్నారు. యుక్రెయిన్‌లో బాంబు దాడుల మధ్య వేలాది మంది భారతీయ పౌరులు చిక్కుకుని ఉన్నారు. వారు సోషల్ మీడియా వేదికగా తిరిగి భారత్‌కు తీసుకుని పోవాలని కేంద్రాన్ని వేడుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని ఏడుపు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె భారత ప్రభుత్వాన్ని సహాయం కోసం వేడుకుంటుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో బాలిక మాట్లాడుతూ.. “జై హింద్, జై భారత్.. దయచేసి మాకు సహాయం చేయండి.” అంటూ వేడుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నివాసి గరిమా మిశ్రా, సహాయం కోసం తాను చేసిన విజ్ఞప్తికి ఎవరూ స్పందించడం లేదని చెబుతోంది. ‘మమ్మల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు.. ఎవరూ సాయం చేయడం లేదు, సాయం వస్తుందో రాదో తెలియట్లేదు’ అని చెబుతోంది.

“మేం ఎక్కడ ఉంటున్నామో అక్కడకు జనాలు వస్తున్నారు. గొడవ చేసి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు.. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కన్నీళ్లు, ముకుళిత హస్తాలతో గరిమా మాట్లాడుతూ.. ‘ఇలా మనం సినిమాల్లో చూసేవాళ్లం. మమ్మల్ని రక్షించడానికి మా ప్రభుత్వం ఉంది అని అనుకున్నాము. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. దయచేసి ఇండియన్ ఆర్మీని పంపండి.. లేకపోతే మేం ఇక్కడి నుంచి బయటకు వెళ్లగలం అని అనుకోవడం లేదు.”అని అన్నారు.

యుక్రెయిన్‌లో దాదాపు 16వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుని ఉన్నారు. చాలా మంది విద్యార్థులు వారు దాక్కున్న భూగర్భ బంకర్‌లు, షెల్టర్‌ల నుంచి వారి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.