Lakhimpur Kheri Violence : శుక్రవారంలోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలి..యోగి సర్కార్ కు సుప్రీం ఆదేశం

లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

Lakhimpur Kheri Violence : శుక్రవారంలోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలి..యోగి సర్కార్ కు సుప్రీం ఆదేశం

Sc (2)

Lakhimpur Kheri Violence  లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. లఖింపూర్ ఘటనపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు రాసిన లేఖ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

లఖింపూర్ ఘటనపై సుప్రీంలో వేసిన పిటిషన్‌లో ‘‘ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం వల్ల పెద్ద సంఖ్యలో రైతులు మరణించారు. దీనిపై ప్రభుత్వం సరైన విధంగా స్పందిచడం లేదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. దీనిపై సరైన చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం అని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ విచారణలో ఘటనకు కారకులైన అందరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, శిక్షించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది శివకుమార్ త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. అనంతరం వాదనలు వినిపించిన యూపీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌.. ఘటన చాలా దురదృష్టకరమైనది, కేసు విచారణకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం…నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో ప్రభుత్వం ఇప్పటి వరకు యోగి సర్కార్ తీసుకున్న చర్యల గురించి ఆరా తీసింది.

లఖింపూర్ ఘటన దురదృష్టకరమని పేర్కొన్న సుప్రీం కోర్టు… అసలు నిందితులు ఎవరు? ఎవరిపై కేసు నమోదు చేశారు? ఎవరిని అరెస్టు చేశారు? అనే పూర్తి వివరాలతో కూడిన స్టేటస్ రిపోర్ట్ ను శుక్రవారం లోగా సమర్పించాలని గురువారం యోగి సర్కార్ ను ఆదేశించింది. ఘటనలో మరణించిన లవ్ ప్రీత్ సింగ్ తల్లికి వెంటనే ఉన్నతస్థాయి వైద్యం అందించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని యూపీ అదనపు అడ్వకేట్​ జనరల్‌ గరిమాప్రసాద్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

కాగా, ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో ఆదివారం యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లాలోని టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో మంత్రుల కాన్వాయ్‌ లోని రెండు కార్లు రైతులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా..ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. అయితే రైతులపైకి దూసుకెళ్లిన ఓ కారులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తుండగా..అసలు ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆశిష్ మిశ్రా చెబుతున్నారు. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్దమేనని ఆశిష్ మిశ్రా తెలిపారు.

ALSO READ Haryana : రైతులపైకి దూసుకెళ్లిన బీజేపీ ఎంపీ కారు..ఒకరికి గాయాలు