Protein Powders : ప్రొటీన్ పౌడర్ల తయారీ ఇంట్లోనే…ఎలాగంటే?

మార్కెట్ లో ఎన్నో రకాల ప్రొటీన్ పౌడర్స్, అనేక రకాల ఫ్లేవర్స్ తో అందుబాటులో వస్తున్నాయి. కానీ, అందులో ఎన్ని ప్రెజర్వేటివ్స్ ఉంటాయో మనకి తెలియదు..

Protein Powders : ప్రొటీన్ పౌడర్ల తయారీ ఇంట్లోనే…ఎలాగంటే?

Protein Powder

Protein Powders : ప్రోటీన్ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రొటీన్ లేనిదే మన ఆరోగ్యమే లేదని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఎదిగే వయస్సున్న పిల్లలకి ప్రొటీన్ చాలా అవసరం. పిల్లలకి కావాల్సిన శక్తి ప్రోటీన్ నుంచే లభిస్తుంది. ప్రొటీన్ ఎగ్స్, నట్స్, ఫిష్, చికెన్, ఫ్రూట్స్, పాలు అన్నింటిలోనూ ఉంటుంది కానీ పిల్లలు అన్నీ తినరు. వాళ్ళు హెల్దీ ఫుడ్‌ని ఇష్టపడేవారు చాలామందే ఉంటారు. ఇలాంటప్పుడు ప్రొటీన్ పౌడర్ పాలలో కలిపి తాగించడం బెస్ట్ ఆప్షన్. అది టేస్టీ గా ఉంటుంది కాబట్టి పిల్లలు మారం చేయకుండా తాగేస్తారు. ఫిట్‌నెస్‌ ప్రియులకు ప్రొటీన్‌ పౌడర్ల విలువేంటో తెలుసు. అయితే మార్కెట్లో వేల రూపాయల ఖరీదైన ప్రొటీన్‌ పౌడర్లను కొనే బదులు, తక్కువ ఖర్చుతో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

మార్కెట్ లో ఎన్నో రకాల ప్రొటీన్ పౌడర్స్, అనేక రకాల ఫ్లేవర్స్ తో అందుబాటులో వస్తున్నాయి. కానీ, అందులో ఎన్ని ప్రెజర్వేటివ్స్ ఉంటాయో మనకి తెలియదు.. అలాంటప్పుడు మనమే ప్రొటీన్ పౌడర్‌ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకున్న ప్రొటీన్ పౌడర్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ అన్నీ హెల్దీ గా ఉండేవి ఎంచుకుంటాం కాబట్టి ఎలాంటి భయం ఉండదు. ప్రొటీన్ పౌడర్లను ఇంట్లోనే సులభంగా అందుబాటులో ఉండే పదార్ధాలతో తయారు చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం…

ప్రొటీన్ పౌడర్ 1;
కావలసిన పదార్థాలు: బాదం: 1 కప్పు, వాల్‌నట్‌: అర కప్పు, పిస్తా పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, గుమ్మడి విత్తనాలు 2 టేబుల్‌ స్పూన్లు, పుచ్చ విత్తనాలు 2 టేబుల్‌ టీస్పూన్లు, పొద్దు తిరుగుడు విత్తనాలు 2 టేబుల్‌ స్పూన్లు, ఓట్స్‌ అర కప్పు, షియా విత్తనాలు 2 టేబుల్‌స్పూన్లు, పాల పొడి అర కప్పు తీసుకోండి.

తయారీ విధానం: బాదం పప్పును చిన్న మంట మీద కమ్మని వాసన వచ్చే వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో పిస్తా, వాల్‌నట్‌, జీడిపప్పు కలిపి వేయించి, పక్కన పెట్టుకోవాలి. గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు వేసి, సువాసన వచ్చే వరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి. ఓట్లను కూడా కరకరలాడే వరకూ వేయించి తీయాలి. వేయించుకున్న వాటికి షియా విత్తనాలు జోడించి, అన్నీ కలిసేవరకూ తిప్పుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత, మిక్సీలో వేసి మెత్తగా పొడి తయారు చేసుకోవాలి. వీటి
నుంచి నూనె వెలువడకుండా పల్స్‌, బ్లెండ్‌ మోడ్‌లను మారుస్తూ ఉండాలి. ఈ పొడిని జల్లించుకుని, పాల పొడి కలుపుకుంటే ప్రొటీన్‌ పౌడర్‌ రెడీ అయినట్టే. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుని, రెండు నెలల లోపు వాడుకోవాలి. ప్రొటీన్‌ మిల్క్‌ కోసం రెండు కప్పుల పాలను వేడి చేసి, తయారుచేసి పెట్టుకున్న ప్రొటీన్‌ పౌడర్‌ 3 స్పూన్లను వేసి, బాగా కలుపుకోవాలి.

ప్రొటీన్ పౌడర్ 2;
కావాల్సిన పదార్ధాలు ; నో ఫ్యాట్ మిల్క్ పౌడర్ – 3 కప్పులు, డ్రై ఓట్స్ – 1 కప్పు, బాదం పప్పు – 1 కప్పు, కొద్దిగా బెల్లం లేదా పంచదార కానీ కావాలనుకుంటే. ఒక పావు కప్పు కోకోవా పౌడర్ కూడా కలుపుకోవచ్చు.

తయారీ విధానం ; వీటన్నింటినీ కలిపి మిక్సీలో పొడి చేసి గాలి చొరని డబ్బాలో పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఫ్రిజ్‌లో దాచుకోవచ్చు. ఇది ప్రతి రోజూ వాడితే ఎంతో మంచిది. ఒక అర కప్పు ప్రొటీన్ పౌడర్ లో 180 క్యాలరీలూ, 12 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఈ పౌడర్ ని పాలలో కలిపి తాగచ్చు, లేదా స్మూతీల్లో, షేక్స్ లో కలిపి కూడా తీసుకోవచ్చు.

ప్రొటీన్ పౌడర్ 3;
కావాల్సిన పదార్ధాలు ; వంద గ్రాముల చొప్పున ఓట్స్, పీనట్స్, ఆల్మండ్స్, సోయా తీసుకోండి. యాభై గ్రాముల పాల పొడి తీసుకోండి.

తయారీ విధానం ; పాల పొడి తప్ప మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీలో ఇవన్నీ వేసి, పాల పొడి కూడా కలిపి పొడిగా మిక్సీ పట్టుకోండి. ఆ పొడిని జల్లించి మెత్తటి పౌడర్ ని స్టోర్ చేసుకోండి. దీన్ని కూడా పాలలో, స్మూతీల్లో, షేక్స్ లో, జ్యూసుల్లో కలిపి తీసుకోవచ్చు.

ప్రొటీన్ పౌడర్ 4 ;

కావాల్సిన పదార్ధాలు ; ఈ పద్ధతిలో బాదం, జీడిపప్పూ, పిస్తా పప్పూ అర కప్పు చొప్పున తీసుకోండి. అర టీ స్పూన్ చొప్పున జాజికాయ పొడి, చిటికెడు పసుపు, కుంకుమ పువ్వూ తీసుకోండి.

తయారీ విధానం ; పప్పుల్ని విడివిడిగా డ్రై రోస్ట్ చేసి చల్లారనివ్వండి. కుంకుమ పువ్వుని కూడా కొద్దిగా రోస్ట్ చెయ్యండి. పప్పులూ, కుంకుమ పువ్వూ కలిపి మిక్సీ లో పొడి చేయండి. అప్పుడు అందులో పసుపు, జాజికాయ పొడి కలిపి మరొక్కసారి మిక్సీ లో కలపండి. అప్పుడు అన్నీ సరిగ్గా కలుస్తాయి. ఈ పౌడర్ కొంచెం అంటుకునేటట్లు ఉండచ్చు. ఈ పౌడర్ ని పాలలో, లడ్డూల్లో కలపచ్చు.

తక్కువ ఖర్చుతో ఇలాంటి ప్రొటీన్ పౌడర్లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే ప్రొటీన్ పౌడర్లను వాడే విషయంలో వైద్యుని సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే కొంత మందికి ప్రొటీన్ పౌడర్ల వినియోగం అవసరత ఉండకపోవచ్చు. మరికొందరికి అవిసరిపడకపోవచ్చు. కాబట్టి డైటీషియన్ సలహామేరకు వాటిని వినియోగించటం ఉత్తమం.