Mamata Meets PM Modi : మోదీతో దీదీ భేటీ..యూపీ ఎన్నికల్లో అఖిలేష్ కి మద్దతు

హస్తిన పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం (BSF)

Mamata Meets PM Modi : మోదీతో దీదీ భేటీ..యూపీ ఎన్నికల్లో అఖిలేష్ కి మద్దతు

Modi Mamata

Mamata Meets PM Modi  హస్తిన పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం (BSF) అధికార పరిధి విస్తరణపై మోదీతో మమత చర్చించారు. ఈ విషయాన్ని భేటీ అనంతరం మమతే స్వయంగా తెలిపారు.

మోదీతో భేటీ అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ…పశ్చిమ బెంగాల్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళానన్నారు. బెంగాల్‌లో బీఎస్​ఎఫ్​ ప్రాదేశిక పరిధి పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినట్లు చెప్పారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయొద్దని ప్రధాని మోదీకి సూచించినట్లు తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్,కేంద్ర నిధుల విషయమై కూడా మోదీతో చర్చించినట్లు మమత తెలిపారు. త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్​ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడి చేసిన విషయాన్ని మోదీ దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు. వచ్చే ఏడాది బెంగాల్​లో జరగనున్న గ్లోబల్​ బిజినెస్​ మీట్​ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించినట్లు మమత తెలిపారు.

పంజాబ్​ ఎన్నికల్లో నేతలందరూ బిజీగా ఉన్నారన్న మమతా.. ప్రధాని అపాయింట్​మెంట్​ తప్ప మరొకరిది తాను కోరలేదని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులో ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్‌ను కలుస్తానని చెప్పారు.ఇక, ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ నేత అఖిలేష్​ యాదవ్​ తమ మద్దతు కావాలని కోరితే తప్పకుండా ఇస్తామని మమత ఈ సందర్భంగా తెలిపారు.

కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్-పాకిస్థాన్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ సరిహద్దుల నుంచి భారత దేశంవైపు 50 కిలోమీటర్ల పరిధిలో భద్రతా బలగాల సోదాలు నిర్వహించేందుకు, అనుమానితులను అరెస్టు చేసేందుకు, వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు అధికారం ఇస్తూ బీఎస్‌ఎఫ్‌ చట్టాన్ని సవరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి లేకుండానే ఈ అధికారాలను వినియోగించవచ్చు. అంతకుముందు నిబంధనల ప్రకారం కేవలం 15 కిలోమీటర్ల పరిధిలోనే బీఎస్ఎఫ్‌కు అధికారం ఉండేది. అయితే తాజా అధికార పరిధి పెంపు నిర్ణయాన్ని మమత వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత వారం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ALSO READ Encounter In Srinagar..ముగ్గురు ఉగ్రవాదులు హతం