Datta Jayanthi 2021 : మార్గశిర పౌర్ణమి దత్త జయంతి

మార్గశిర శుక్ల పౌర్ణమిని దత్తాత్రేయ జయంతి గా జరుపుకుంటారు భక్తులు. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత,ప్రేత పిశాచాలు బాధించవు, గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి.

Datta Jayanthi 2021 : మార్గశిర పౌర్ణమి దత్త జయంతి

Sri Datta Jayanthi

Datta Jayanthi 2021 :  మార్గశిర శుక్ల పౌర్ణమిని దత్తాత్రేయ జయంతి గా జరుపుకుంటారు భక్తులు. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత,ప్రేత పిశాచాలు బాధించవు, గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి. విద్యార్ధులకు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో చదువు బాగా వస్తుంది. మేడి చెట్టు(ఔదుంబర వృక్షం)కింద ఉంటారు. పరమాత్మ ఒక్కో సమయంలో ఒక్కో అవతారంలో వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తాడు. ధర్మావతారాల్లో…రాముడిగా, కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే…దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు. దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారమని భాగవతమూ, విష్ణుపురాణమూ ఘోషిస్తున్నాయి.

అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు. ఆ దంపతులు ఓంకారాన్ని ధ్యానిస్తూ మహాతపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి ఓ దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది. ఆ కాంతిపుంజంలో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఆ ముగ్గురు మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది , త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము “సమర్పించుకున్నారు” కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. అత్రి…అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం.

దత్తం..అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.
దత్తుడిది జ్ఞానావతారం! పిచ్చివాడిలానో, వ్యసనపరుడిలానో కనిపించి…పైపై మెరుగులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధిచెప్పిన ఉదంతాలు అనేకం. దేవతలకు కూడా చేతిలో కల్లుముంతతో, ఒడిలో ప్రియురాలితో దర్శనమిచ్చాడోసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం… ఆమె శ్రీలక్ష్మి. దత్తుడు ఓపట్టాన అర్థం కాడు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి.

అసుర సంహారం…
పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ప్రజల్ని హింసించేవాడు. దీంతో దేవతలంతా…విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడిని ప్రార్థించారు. ‘ఆ రాక్షసుడిని నా దగ్గరికి తీసుకురండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను’ అని మాటిచ్చాడు. దీంతో దేవతలు జంభాసురుడి మీద కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు నటించారు. ఆ రాక్షసుడికి కోపం తన్నుకొచ్చింది. ‘ఇంతకుముందే చావుదెబ్బ తీశాను. అంతలోనే ఇంత ధైర్యం ఏమిటి?’ అంటూ కోపంగా మళ్లీ దేవతలమీదకు ఉరికాడు.

దేవతలు ఉద్దేశపూర్వకంగా వెన్నుచూపి పారిపోసాగారు. జంభాసురుడు వాళ్లను తరుముతూ వెళ్లాడు. దత్తుడి సమక్షంలోకి వెళ్లగానే ఠక్కున మాయమైపోయారు దేవగణమంతా. ఎదురుగా…ఒడిలో అందాల రాశితో, మహాభోగిలా దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు. జంభాసురుడి కళ్లు ఆ సౌందర్యరాశి మీదికి మళ్లాయి. ఆమె శ్రీమహాలక్ష్మి అన్న ఇంగితం కూడా లేకుండా… బలవంతంగా తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకున్నాడు. సంపద నెత్తికెక్కిందంటే, పతనం మొదలైనట్టే. జంభాసురుడి బలం క్షీణించసాగింది. దేవతల పని సులువైపోయింది. అసుర సంహారం జరిగిపోయింది.

Also Read : Tiruppavai : తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై
ప్రహ్లాద వరదుడు…
అనేక సంవత్సరాల రాజ్యపాలన తర్వాత…జ్ఞానాన్వేషణలో ప్రహ్లాదుడు అరణ్యమార్గం పట్టాడు. అక్కడ, అజగరవృత్తిలో ఓ వ్యక్తి కనిపించాడు. అజగరం అంటే…కొండచిలువ! ఆ విషప్రాణికో ప్రత్యేకత ఉంది. కొండచిలువ ఆహారం కోసం వేటకు వెళ్లదు. తాను ఉన్నచోటికి ఆహారం వస్తే మాత్రం…గుటుక్కున మింగి కడుపు నింపుకుంటుంది. లేకపోతే ఉపవాసమే. సాధకులు కూడా…ఆహారపానీయాల విషయంలో ఇలాంటి నిర్మోహత్వాన్నే అనుసరిస్తారు. పిచ్చివాడిలా కనిపిస్తున్న ఆ మనిషే దత్తుడని ప్రహ్లాదుడు గ్రహించాడు. ‘జై గురుదత్తా…’ అంటూ పాదాల మీద పడ్డాడు. ఆ మహాగురువు కరుణించి జ్ఞానమార్గాన్ని బోధించాడు.

వివిధ సందర్భాల్లో… కార్తవీర్యార్జునుడికీ, పరశురాముడికీ, యదువంశ మూలపురుషుడు యదువుకూ…ఇలా ఎంతోమందికి జ్ఞానాన్ని బోధించాడు దత్తగురుడు. యోగిరాజ వల్లభుడు, జ్ఞానసాగరుడు, సంస్కారహీన శివురూపుడు…ఇలా భిన్నరూపాలలో కనిపించి భక్తులకు దివ్యప్రబోధ చేశాడు. మహారాష్ట్రలోని మహుర్‌ సుప్రసిద్ధ దత్తక్షేత్రం. దత్తుడు కాశీలో స్నానంచేసి, కొల్హాపూర్‌లో భిక్ష స్వీకరించి, మహుర్‌లో నిద్రించేవాడని అంటారు.

శ్రీపాద శ్రీవల్లభుడు (పిఠాపురం), నరసింహ సరస్వతి (మహారాష్ట్ర), అక్కల్‌కోట మహరాజ్‌ (అక్కల్‌), షిర్డీసాయి (షిర్డీ) దత్తుని అవతారాలని చెబుతారు. దత్తుడు స్మృతిగామి… తలచిన వెంటనే భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమైపోతాడని సాధకుల విశ్వాసం.

మార్గశిర పౌర్ణమినాడు దత్తుడు ఉదయించాడు. అదే దత్తజయంతి. దత్తుడి రూపం అపురూపం. ఆరు చేతులూ, మూడు తలలూ, చేతిలో డమరుకమూ, త్రిశూలమూ…తదితర ఆయుధాలుంటాయి. చుట్టూ కుక్కలు ఉంటాయి. ఆ శునకాలు వేదానికి ప్రతీకలు. ఆయన వెనకాల కనిపించే గోవు…ఉపనిషత్తుల సారం.

దత్తజయంతి నాడు భక్తులు…జపతపాలతో, పూజలతో గడుపుతారు. పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం భజనలూ సత్సంగాలూ నిర్వహించుకుంటారు. దత్తచరిత్ర, అవధూత గీత తదితర గ్రంథాల్ని పారాయణ చేస్తారు.   ఈఏడాది మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 18న  వచ్చింది.(18-12-21) ఒకానొక సమయంలో దత్త సంప్రదాయం తెలుగు గడ్డ మీద వెలుగులీనింది. దత్తుడి అవతారమని భావించే శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రదేశంలోని పిఠాపురంలో జన్మించాడు. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కురుపురంలో ఆశ్రమజీవితం గడిపాడు. అక్కడి కృష్ణాతీరంలో ఓ ఆలయాన్ని నిర్మించారు భక్తులు. నేపాల్‌ తదితర ప్రాంతాల్లోనూ దత్తక్షేత్రాలున్నాయి.