Viral Food : నెయ్యిలో ‘ఈత’ కొట్టిన పరోటా .. స్వర్గానికి టికెట్ అంటూ కామెంట్లు
పరోటా బాబూ పరోటా..అలాంటిలాంటి పరోటా కాదు బాబు..నెయ్యిలో తానాలు చేసిన పరోటా..ఇలా ఒక్కముక్క తుంచి నోట్లో పెట్టుకున్నారా..స్వర్గమే..

Ghee Paratha
Viral Food : సోషల్ మీడియా వేదిక వచ్చే వింత వింత ఫుడ్ కాంబోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఆమ్ కి పూరీ అంటూ మామిడితో పూరీ, ‘తందూరి చికెన్ ఐస్ క్రీం’ (Tandoori chicken ice cream),ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో..ఎన్నెన్నో. తాజాగా ఓ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ వ్యక్తి ఓ పరాటా వేశాడు. ఆ పరాటా తింటే నా సామిరంగా స్వర్గం కనిపిస్తుందనేలా ఉంది..
ఎందుకంటే పరోటాలు తయారు చేసే ఈ పెద్దాయన పరోటాను నెయ్యితో కాల్చకుండా ఏకంగా నెయ్యిలో తానాలు అదేనండీ స్నానం చేయించేశాడు. ఇంకా చెప్పాలంటే ఈతలు కొట్టించేశాడు. పరోటాలను తక్కువ నెయ్యితో తయారు చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న వీడియోలో పరోటాలు తయారు చేసే పెద్దాయన మాత్రం ఒక్క పరోటా తయారు చేయటానికి ప్యాకెట్ నెయ్యిని సగానికి పైగా వాడేశాడు.
అతను పరోటాను నెయ్యిలో స్విమింగ్ చేయించాడని..అది తింటే స్వర్గానికి తీసుకెళ్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే అతనే నెయ్యిని కూడా అమ్ముతున్నాడేమో పరోటా అక్కడ సైడ్ డిష్లాగా ఉందని చమత్కారంగా కామెంట్స్ చేశారు.ఈ నెయ్యిలో తానాలు చేసే పరోటా వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఒకప్పుడు మన పెద్దలు నెయ్యి ‘పోసుకుని’తినేవారు. మరి ఇప్పుడు నెయ్యి ‘వేసుకోవటానికే’భయపడిపోతున్నారు. ఎందుకంటే అధికబరువు సమస్య. కానీ నెయ్యి అనేది ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ నెయ్యి తింటే అనేది అధికబరువు కారణం అనే భయంతో ఇప్పుడు చాలామంది నెయ్యి తినటానికే భయపడిపోతున్నారు. ఏది ఏమైనా ముద్దపప్పు..ఆవకాయలో నెయ్యి వేసుకుని కాదు కాదు పోసుకుని తింటే స్వర్గం ఎక్కడుంటుంది మన నాలుకమీద కాకుండా..