Indian National Flag : భారత జాతీయ పతాకానికి వందేళ్లు..జెండా రూపశిల్పి ఎవరంటే?

కోట్లాది హృదయాలను అద్దుకున్న మూడురంగుల మువ్వన్నెల మన జాతీయ పతాకం వందేళ్లు పూర్తి చేసుకుంది. మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసింది తెలుగు వెలుగు పింగళి వెంకయ్య.

Indian National Flag : భారత జాతీయ పతాకానికి వందేళ్లు..జెండా రూపశిల్పి ఎవరంటే?

Indian National Flag

One hundred years complete of the Indian National Flag : కోట్లాది హృదయాలను అద్దుకున్న మూడురంగుల మువ్వన్నెల మన జాతీయ పతాకం బుధవారం నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో సమరయోధుల భుజాలపై నిలిచి భారతీయుల ప్రతాపానికి, దేశభక్తికి ప్రతీకగా వెలుగొందిన మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసింది తెలుగు వెలుగు పింగళి వెంకయ్య. వివిధ దేశాల జెండాలు పరిశీలించడంతో పాటు మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. 1921 మార్చి 31న బెజవాడ విక్టోరియా మహల్‌లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో స్వాతంత్య్ర సమరయోధుల సమక్షంలో ఈ పతాకాన్ని జాతిపిత మహాత్మాగాంధీకి ఆయన అందజేశారు.

జెండా రూపకల్పన వెనుక అసలు కథ…
1906లో కోల్‌కతాలో 22వ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు నిర్వహించారు. ‘ది గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌’గా పిలిచే దాదాబాయి నౌరోజి సభకు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి ముందు బ్రిటిష్‌ వారి పతాకమైన యూనియన్‌ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడంతో పింగళి వెంకయ్య కలత చెందారు. ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనసులో మెదిలింది. ఆసభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సమితి సభ్యునిగా నియమించారు. అనంతరం జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటించి 1916లో ‘ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా’ అనే ఆంగ్ల పుస్తకం రచించారు.

పింగళి వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతలు..
1921 మార్చి 31న విజయవాడలోని విక్టోరియా జూబిలి(బాపూ) మ్యూజియం సమావేశ మందిరంలో మహాత్మాగాంధీ సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. అప్పటికే గాంధీ, పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పనపై పలుమార్లు మాట్లాడారు. ఈ సమావేశంలోనే వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు గంటల వ్యవధిలోనే తన సహ అధ్యాపకుడు అయిన ఈరంకి వెంకటశాస్త్రి సహకారంతో జెండా నమూనా తయారుచేసి గాంధీకి అప్పగించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పాటు చరఖా (రాట్నం) చిహ్నం అందులో ఉంది. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో గాంధీ ఎరుపు రంగు హిందువులకు, ఆకుపచ్చ ముస్లింలకు, తెలుపు రంగు ఇతర మతాలకు ఉండేలా పతాకం తీర్చిదిద్దాలని సూచించారు. ఇలా ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల మధ్యలో రాట్నం గుర్తుతో జాతీయ పతాకం తయారు చేశారు.

జాతీయ జెండాలో మార్పులు
1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభల్లో సిక్కులు పతాకంలోని రంగుల గురించి సమస్య లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం అజాద్‌, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తారాసింగ్‌, దత్తాత్రేయ బాలకృష్ణతో కూడిన కమిటీ సూచనల ప్రకారం ..కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకంపై రాట్నం ఉండేలా వెంకయ్య జెండాలో మార్పులు చేశారు. ఈ మార్పును కాంగ్రెస్‌ జాతీయ మహాసభ ఆమోదించింది. అయితే జాతీయ పతాకానికి, పార్టీ జెండాకు మధ్య వ్యత్యాసం ఉండాలనే ఆలోచనతో.. 1947 జులై 22న ప్రకటించిన ప్రకారం జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల పట్టీలతో.. మధ్యలో నీలిరంగులో అశోకుని ధర్మచక్రం ఉండేలా నిర్ణయం తీసుకొని మార్పులు చేశారు.