PM Modi : రక్షణ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని..”సెంట్ర‌ల్ విస్టా” విమ‌ర్శ‌కుల‌పై ఫైర్‌

ఢిల్లీలో కొత్త‌గా నిర్మించిన ర‌క్ష‌ణ‌శాఖ ఆఫీసుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు.

10TV Telugu News

PM Modi ఢిల్లీలో కొత్త‌గా నిర్మించిన ర‌క్ష‌ణ‌శాఖ ఆఫీసుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. 7 వేల మందికిపైగా ఉన్న ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌, సాయుధ బ‌లగాల ఉద్యోగుల కోసం క‌స్తూర్బా గాంధీ మార్గ్‌, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే సహా పలువురు హాజరయ్యారు.

కొత్త రక్షణ కార్యాలయ సముదాయంలో సైనిక, నౌక, వైమానిక దళాల అధికారులు సహా రక్షణ మంత్రిత్వశాఖ సిబ్బంది ఉంటారు. దీనిని 7,000 మంది బస చేసేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ భవనాలు.. సురక్షిత, క్రియాశీలక పని ప్రదేశాలుగా మారనున్నాయి. ఈ భవనాల కార్యకలాపాల నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ స్థాపించారు. అలాగే భవనాల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఈ సంద‌ర్భంగా కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణం కోసం చేప‌డుతున్న సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టును విమ‌ర్శిస్తున్న వారిపై ప్రధాని మోదీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కీల‌క ప్ర‌భుత్వ ఆఫీసులు, మంత్రిత్వ కార్యాల‌యాలు ఎలా ఉన్నాయో ప్రతిప‌క్షాలు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని విమ‌ర్శించారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొంద‌రు ఎలా ప్ర‌వ‌ర్తించారో తెలుసుని, స్వ‌లాభం కోసం త‌ప్పుడు స‌మాచారాన్ని చేర‌వేశార‌ని, కానీ వాళ్లు ఎప్పుడూ ప్ర‌భుత్వ కార్యాల‌యాల దీన‌స్థితి గురించి మాట్లాడ‌లేద‌ని, మంత్రులు ప‌నిచేసే ఆఫీసులు ఎలా ఉన్నాయో ప‌ట్టించుకోలేద‌ని, ర‌క్ష‌ణ‌శాఖ కాంప్లెక్స్ గురించి వాళ్లు ఎన్న‌డూ పెద‌వి విప్ప‌లేద‌ని ప్ర‌ధాని విమ‌ర్శించారు.

ప్ర‌తిప‌క్షాలు కేవ‌లం వ్యక్తిగత ఎజెండా కోస‌మే జాగ్ర‌త్త‌ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు. కాగా,సుమారు 20 వేల కోట్ల‌తో కేంద్రం సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టును చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌, సెక్ర‌టేరియ‌ట్‌, 3 కి.మీ. రాజ్‌ప‌థ్ మార్గం పున‌రుద్ధ‌ర‌ణ‌, కొత్త ప్ర‌ధాన‌మంత్రి నివాసం, పీఎంవో, ఉపాధ్య‌క్షుడి నివాసాన్ని నిర్మిస్తున్నారు.

మరోవైపు, కొత్త‌గా అభివృద్ధి చేసిన సెంట్ర‌ల్ విస్టాలోనే వ‌చ్చే ఏడాది రిప‌బ్లిక్ డే ప‌రేడ్ జ‌రుగుతుంద‌ని చెప్పారు కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరి. రెండున్న‌ర నెల‌ల్లో ఈ ప్రాజెక్ట్ పూర్త‌వుతుంద‌ని అన్నారు. అంతేకాదు వ‌చ్చే ఏడాది పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌లోనే జ‌రుగుతాయ‌ని కూడా ఆయ‌న తెలిపారు.

READ Kanhaiya Kumar : కాంగ్రెస్ లోకి కన్నయ్య,జిగ్నేష్!

×