Prakash Raj : రాజ్యసభకు టీఆర్ఎస్ తరపున విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌?

బీజేపీ వ్యతిరేక భావజాలంతో దేశవ్యాప్తంగా ప్రకాశ్‌రాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

Prakash Raj : రాజ్యసభకు టీఆర్ఎస్ తరపున విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌?

Prakash Raj

Prakash Raj : టీఆర్ఎస్ తరపున విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రకాశ్‌రాజ్‌కు గులాబీ బాస్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించిన ప్రకాశ్‌రాజ్…. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోనూ ప్రకాశ్‌రాజ్‌కు అభిమానులున్నారు. దీనికితోడు బీజేపీ వ్యతిరేక భావజాలంతో దేశవ్యాప్తంగా ప్రకాశ్‌రాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

త్వర‌లో తెలంగాణలో మూడు రాజ్యస‌భ స్థానాల‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఒక స్థానంలో ప్రకాశ్ రాజ్ కు అవ‌కాశం క‌ల్పిస్తే… జాతీయ స్థాయిలో బిజెపి వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని గులాబీ బాస్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉండగా.. జూన్‌లో మరో ఇద్దరు డీఎస్‌, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని ప్రకాశ్‌రాజ్‌కు ఇచ్చే యోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్లు టీఆర్ఎస్‌ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.

Prakash Raj: ‘MAA’కు మూకుమ్మడి రాజీనామా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం

బీజేపీకి వ్యతిరేకంగా గ‌ళం విప్పుతున్న ప్రముఖుల్లో ప్రకాశ్ రాజ్ ఒక‌రు. తొలి విడ‌త ఎన్డీయే స‌ర్కార్ ఏర్పడిన తర్వాత సైద్ధాంతికంగా ఆ పార్టీ విధానాల‌ను విభేదిస్తున్నారు. రాజ‌కీయాల్లో క్రియాశీల పాత్ర పోషించ‌క‌పోయినా… జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న న‌టుడు కావ‌డంతో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు నేషనల్ వైడ్‌ చ‌ర్చకు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు నుంచి గులాబీ పార్టీతో ట‌చ్‌లో ఉన్న ప్రకాశ్ రాజ్… ఆ సంబంధాలు అదే విధంగా కొన‌సాగిస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు నినాదాన్ని అందుకోవ‌డంతో…. అప్పుడు గులాబీ బాస్‌కు ప్రకాశ్‌రాజ్ మద్దతు తెలిపారు.

తాజాగా ముంబై ప‌ర్యట‌న‌లో మ‌రోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగ‌తం ప‌లక‌డం, ఉద్దవ్‌ ఠాక్రేతో భేటీ అయిన టీమ్‌లో ప్రకాశ్‌రాజ్‌ ఉండటం రాజ‌కీయంగా ప్రాధాన్యత సంత‌రించుకుంది. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ప్రకాశ్‌రాజ్‌.,, మూడేళ్లుగా స‌న్నిహితంగా మెలుగుతున్నారు. గతంలో గులాబీబాస్ క‌ర్ణాటకలో ప‌ర్యటించి మాజీ ప్రధాని దేవ‌గౌడతో భేటీ అయిన సందర్బంగా ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. ముఖ్యమంత్రి బ‌యోపిక్ తీస్తార‌ని గ‌తంలో ప్రచారం జ‌రిగిన స‌మ‌యంలోనూ వ‌రుస‌గా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా పలుమార్లు ముఖ్యమంత్రి వెంటే వ‌చ్చి ప‌రిశీలించారు.

MAA Association: ప్రకాశ్ రాజ్ మరో బాంబ్..! బూతులు తిట్టారు.. గొడవలు చేశారు.. ఫుటేజ్ కావాలి

సినీ న‌టుడుగా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు…. జాతీయ స్థాయిలో ఆయ‌న‌కు ఉన్న గుర్తింపును రాజ‌కీయంగా వినియోగించుకునేందుకు గులాబీ బాస్‌ ప్రయత్నిస్తున్నారు. భారతీయ జ‌న‌తా పార్టీ నుంచి సైధ్దాంతికంగా విబేధించే ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తుండ‌డంతో…. గులాబీ పార్టీ త‌ర‌పున జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. కేంద్రంపై చ‌ట్ట స‌భ‌ల్లో గ‌ళం విప్పేందుకు రాజ్యస‌భకు పంపే అవకాశం ఉందని గులాబీ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది.