Prakash Raj: ‘MAA’కు మూకుమ్మడి రాజీనామా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం

'మా' ఎన్నికల ఉత్కంఠ పోరులో ప్రెసిడెంట్ పదవికి పోటీచేసి ఓడిపోయిన నటుడు ప్రకాష్ రాజ్..

Prakash Raj: ‘MAA’కు మూకుమ్మడి రాజీనామా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం

Prakash Raj

‘మా’ ఎన్నికల ఉత్కంఠ పోరులో ప్రెసిడెంట్ పదవికి పోటీచేసి ఓడిపోయిన నటుడు ప్రకాష్ రాజ్.. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11మంది వారి పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నో కలలు, ఆశలతో మాలో పోటీ చేశామని, అయితే, ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగింది. క్రమశిక్షణ కలిగిన బెనర్జీపై మోహన్ బాబు చేయి చేసుకున్నారని అన్నారు.

ముందు రోజు 11మంది ఈసీ సభ్యులు గెలిచారని అన్నారని, సడెన్‌గా లెక్కలు ఎలా మారిపోయాయని ప్రశ్నించారు. మీరు, మేమూ అనుకుంటే సరిగ్గా పనిచేయలేమని, ఎన్నికలు జరిగిన తీరు సరిగ్గా లేదన్నారు ప్రకాష్ రాజ్. ఎన్నికల్లో గెలిచిన సభ్యులు కూడా వారితో పనిచేయలేమని అంటున్నారు. అందుకే గెలిచిన పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నిర్ణయించుకుంది. అయితే ‘మా’ సభ్యత్వం రాజీనామా విషయంలో మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు చెప్పారు ప్రకాష్ రాజ్.

ఈ మేరకు మూకుమ్మడిగా రాజీనామా లేఖను రాశారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచిన సభ్యులు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల లేఖ యథాతథంగా:

PRESIDENT, MOVIE ARTISTS ASSOCIATION, HYDERABAD.

సార్,

ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళాలంటే, అందరి ఆలోచనలు, ఆచరణలు, ఒకేలా ఉండటం అవసరం. అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యంగా, సభ్యుల శ్రేయస్సు దిశగా నడిచే అవకాశం ఉంటుంది. గత రెండేళ్లలో శ్రీ నరేష్ గారు “మా” అధ్యక్షులుగా ఉన్న సమయంలో, తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, అంతా తానే అయ్యి, “మా” కోసం ఏ పనీ జరగనివ్వని స్థితికి తీసుకువచ్చారు, జరిగిన గొప్ప పనులపై కూడా బురద చల్లారు.

ఇపుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుద్దేమో అనే సంశయంతో ఉన్నాం. ఈసారి జరిగిన ఎలక్షన్స్‌లో శ్రీవిష్ణు గారి ప్యానల్ నుంచి కొందరు, శ్రీ ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్ నుంచి కొందరు గెలవడం జరిగింది. మళ్లీ మాలో మాకు భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది, సహజంగా ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న మేము అడగకుండా ఉండలేము. అందుకని “మా” సంస్థని శ్రీ విష్ణుగారి ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యంతో, మేము “మా” పదవులకు మనసావాచా కర్మణా రాజీనామా చేస్తున్నాం.

అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందువల్ల భవిష్యత్తులో “మా” లో ఏ అభివృద్ధి జరక్కపోయినా, సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తుంటాం.”

ఇట్లు:
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు

ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌ నుంచి బెనర్జీ (ఉపాధ్యక్షుడు), శ్రీకాంత్‌(ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), ఉత్తేజ్‌(జాయింట్‌ సెక్రటరీ) ఈసీ మెంబర్లుగా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్‌, తనీష్‌, సురేశ్‌ కొండేటి, సమీర్‌, సుడిగాలి సుధీర్‌, కౌశిక్‌ గెలిచారు.