నయా భారత్‌కు కొత్త పార్లమెంట్ సింబల్‌లా ఉంటుంది : మోడీ

  • Published By: bheemraj ,Published On : December 10, 2020 / 03:43 PM IST
నయా భారత్‌కు కొత్త పార్లమెంట్ సింబల్‌లా ఉంటుంది : మోడీ

new Parliament building construction : నయా భారత్ కు కొత్త పార్లమెంట్ సింబల్ లా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ పార్లమెంట్ భవనం 75 వ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి గురువారం (డిసెంబర్ 10, 2020) ప్రధాని మోడీ భూమి పూజ చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా భూమి పూజ నిర్వహించారు. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, కేంద్రమంత్రులు, మాజీ ప్రధానులు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇవాళ చరిత్రాత్మక ఘట్టం అన్నారు.



భారతదేశ ప్రజాస్వామ్యం ప్రస్థానంలో ఈరోజు ఎంతో ప్రత్యేకం అన్నారు. 130 కోట్ల మంది భారతీయులు గర్వించే సుదినం చెప్పారు. ఇది దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకున్న భవనం అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనంలోనే భారత రాజ్యాంగ సవరణ జరిగిందని గుర్తు చేశారు. కొత్త పార్లమెంట్ భారతీయుల ఆకాంక్షలకు ప్రతీకంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో అనేక సమస్యలున్నాయని తెలిపారు. చరిత్రను గౌరవిస్తూనే వాస్తవ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు.



భూమి పూజ జరిగే ప్రాంతంలో సర్వమత ప్రార్థనలు చేశారు. రూ.971 కోట్ల వ్యయంతో కొత్త భవనం నిర్మాణం జరుగనుంది. వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయాలా నిర్మిస్తున్నారు. 2022 చివరి నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా ఉంది.

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కొత్త పార్లమెంట్ లో జరిగే అవకాశం ఉంది. 1,276 మంది సభ్యులకు సరిపోయాలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.



ప్రతి ఎంపీకి ఓ కార్యాలయం ఉంటుంది. భారత సంస్కృతి, వైవిధ్యం ప్రతిబింబించేలా నిర్మాణం ఉండనుంది. పురివిప్పిన నెమలి ఆకృతిలో లోక్ సభ పైకప్పు ఉండనుంది. విరబూసిన కమలం ఆకృతిలో రాజ్యసభ పైకప్పు ఉంటుంది. పార్లమెంట్ లో అంతర్భాగం మర్రిచెట్టు ఆకృతిలో ఉంటుంది.