Mahesh Koneru : మహేష్ కోనేరు ఇకలేరు

యువ నిర్మాత, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు హఠాన్మరణం..

Mahesh Koneru : మహేష్ కోనేరు ఇకలేరు

Mahesh Koneru

Updated On : October 12, 2021 / 3:51 PM IST

Mahesh Koneru: యువ నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద చాయలు అలముకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు వారికి పర్సనల్ పిఆర్‌వోగా పనిచేశారు.

Nedumudi Venu : ప్రముఖ నటుడు నెడుముడి వేణు కన్నుమూత

గుండెపోటుతో మంగళవారం ఉదయం వైజాగ్‌లో కన్నుమూశారు. ఈస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ మీద ‘నా నువ్వే’, ‘118’, ‘తిమ్మరుసు’, ‘మిస్ ఇండియా’ సినిమాలు నిర్మించిన మహేష్,  విజయ్ నటించిన ‘విజిల్’, ‘మాస్టర్’ సినిమాలను తెలుగులో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ‘సభకు నమస్కారం’ తో పాటు అల్లరి నరేష్ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలు తీసే ప్లాన్‌లో ఉన్న మహేష్ కోనేరు హఠాత్తుగా మరణించడంతో సినీ పరిశ్రమ షాక్ అయ్యింది.

ఇండస్ట్రీ వర్గాల వారు, పాత్రికేయులు మహేష్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. మహేష్ మరణవార్త విని షాక్‌కి గురయ్యానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘బరువెక్కిన హృదయంతో చెప్తున్నా.. నా ఆప్త మిత్రుడు మహేష్ కోనేరు ఇకలేరు అంటే నాకు మాటలు రావడం లేదు.. మహేష్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు.

‘అత్యంత ఆప్తుడిని, కుటుంబ సభ్యుడిని కోల్పోయాను.. మహేష్ కోనేరు మాకు వెన్నుముక. నాకు వ్యక్తిగతంగా మరియు ఇండస్ట్రీకి పెద్ద నష్టం ఆయణ్ణి కోల్పోవడం. మహేష్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.