Chennai Rains: మునిగిన చెన్నై.. ఎల్లుండి ఏపీ, తమిళనాడుకు కుంభవృష్టి హెచ్చరిక

తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. కుండపోత వర్షాలకు చెన్నై మహానగరం నీట మునిగింది. మరో రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Chennai Rains: మునిగిన చెన్నై.. ఎల్లుండి ఏపీ, తమిళనాడుకు కుంభవృష్టి హెచ్చరిక

Red Alert Issued For Chennai As More Rains Expected On November 10, 11

Tamil Nadu Heavy  Rains Red Alert  : తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో భారీవర్షాలు, వరదలు బీభ్సతం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలకు చెన్నై మహానగరం నీట మునిగింది. వర్షం కురిసే అవకాశం ఉందని ముందుస్తు హెచ్చరికలు జారీ చేసిన చెన్నై వాతావరణ కేంద్రం.. ఈ స్థాయిలో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేయలేదు. వాతావరణ కేంద్రం అంచనాలను తలకిందులు చేస్తూ కుండపోతగా వర్షం కురిసింది. 12 గంటల్లోనే 23సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీధులన్నీ నదులను తలపించేలా ఉన్నాయి. పుళల్‌, చెంబరబాక్కం, పూండి రిజర్వాయర్ల నుంచి భారీగా వరదనీరు రోడ్లపైకి రావడంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ఉత్తర, దక్షిణ చెన్నై అంతా నీటమునిగిపోయింది. మరో రెండు రోజుల (నవంబర్ 10, 11 తేదీల్లో) పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో చెన్నై తీర ప్రాంతా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

రాష్ట్రంలో నవంబర్‌ 10,11 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. ఈ నెల 9న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, తమిళనాడుతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నవంబర్ 6న నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నవంబర్ 9న తిరువణ్ణామలై, విల్లుపురం, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువలూరులకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, దిండిగల్, సేలం, కళ్లకురుచ్చి, తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ తుఫాను సముద్ర మట్టానికి 4.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. రానున్న 36 గంటల్లో నైరుతి, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. నవంబర్ 11 తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. నవంబర్ 10 (బుధవారం) మధ్యాహ్నం నుంచి ప్రారంభమై నవంబర్ 11 మధ్యాహ్నం వరకు నాన్‌స్టాప్‌గా కొనసాగుతుందని భావిస్తున్నారు.

ఉరుములతో కూడిన భారీ వర్షాలు :
వేదారణ్యం-తిరువారూర్ బెల్ట్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఇప్పటికే 41 ప్రాంతాలను వరదలకు గురయ్యే ప్రాంతాలుగా గుర్తించిందని తెలిపారు. ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు (నవంబర్ 9న) మధ్యాహ్నం 12.30 గంటలకు IMD విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. డెల్టా జిల్లాలు, పుదుకోట్టై, రామనాథపురం, కారైకాల్‌లోని ఏకాంత ప్రదేశాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెన్కాసి, తిరునెల్వేలి, తూత్తుకుడి, కడలూరు, మధురై, శివగంగై జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, అరియలూరు, పెరంబలూరు, తిరుచిరాపల్లి, విల్లుపురం జిల్లాలు, పుదుచ్చేరిలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన తమిళనాడులో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.

అక్టోబర్ 10 నాటికి, డెల్టా జిల్లాలు, కడలూరు, విల్లుపురం, పుదుకోట్టై, శివగంగ, రామనాథపురం, పుదుచ్చేరి, కారైకాల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. చెన్నై, తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్‌కాసి, విరుదునగర్, మదురై, అరియలూరు, పెరంబలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నవంబర్ 11వ తేదీన చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే చెన్నైలో కురిసిన భారీవర్షాలకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై వరదనీరు చేరింది. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోకల్‌ ట్రైన్స్‌ కూడా రద్దయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. చెన్నైలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో మదురై జిల్లాలో 44 మంది నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (NDRF‌) సభ్యులను మోహరించారు. తమిళనాడులో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు.
Read Also :  World Oldest Cake : 80 ఏళ్లనాటి చాక్లెట్ కేకు..ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే..!!