National News: లూథియానా జిల్లా కోర్ట్ లో బాంబు బ్లాస్ట్ వెనుక మాస్టర్ మైండ్ జర్మనీలో అరెస్ట్

ఇటీవల పంజాబ్ లోని లూథియానా జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి అసలు సూత్రధారి ఉగ్రవాది జస్వీందర్ సింగ్ ముల్తానీనీ జర్మనీ పోలీసులు అరెస్ట్ చేసారు.

National News: లూథియానా జిల్లా కోర్ట్ లో బాంబు బ్లాస్ట్ వెనుక మాస్టర్ మైండ్ జర్మనీలో అరెస్ట్

Multani

Updated On : December 29, 2021 / 9:07 PM IST

National News: ఇటీవల పంజాబ్ లోని లూథియానా జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి అసలు సూత్రధారిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేసారు. సిక్కు ఫర్ జస్టిస్(SFJ) అనే వేర్పాటువాద సంస్థకు చెందిన ఉగ్రవాది జస్వీందర్ సింగ్ ముల్తానీ ఈపేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్ గా ఇండియన్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఈక్రమంలో జర్మనీలో తలదాచుకున్న ముల్తానీని అరెస్ట్ చేయాలంటూ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి జర్మనీ ప్రభుత్వం వెనువెంటనే స్పందించి, ఉగ్రవాది జస్వీందర్ సింగ్ ముల్తానీని అరెస్ట్ చేసింది. లూథియానా పేలుళ్ల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. పంజాబ్ సహా ముంబైలోనూ ముల్తానీ.. భారీ పేలుళ్లకు కుట్రలు పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు. అందుకోసం ముల్తానీ ఇప్పటికే పాక్ నుంచి అక్రమ మార్గంలో మందుగుండ్లు, భారీగా పేలుడు సామాగ్రిని దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.

పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ బలపరిచిన ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ నుంచి ముల్తానీకి చెందిన SFJ ఉగ్రవాద సంస్థకు సహకారం అందుతున్నట్లు భారత నిఘావర్గాలు గుర్తించాయి. అంతే కాదు, రానున్న పంజాబ్ ఎన్నికలను ఆసరాగా చేసుకుని దేశంలో అలజడి సృష్టించాలన్నది జస్వీందర్ సింగ్ ముల్తానీ ముఖ్యఉద్దేశ్యంగా పోలీసులు గుర్తించారు. ఈపాటికే అందుకు సంబధించి భారీ పన్నాగం కూడా పన్నాడు ముల్తానీ. భారత్ లో సాగు చట్టాలను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను కూడగట్టిన రైతు నేత… బల్బీర్ సింగ్ రాజేవాల్ ను హతమార్చి..దాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించాలని SFJ లీడర్, గురుపత్వంత్ సింగ్ పన్ను.. ముల్తానీతో కలిసి కుట్ర పన్నాడు. తద్వారా పంజాబ్ రాష్ట్రంలో సిక్కులను రెచ్చగొట్టి..వారిని ఖలిస్థాన్ ఏర్పాటు కోసం తనవైపు తిప్పుకోవచ్చని గురుపత్వంత్ సింగ్ పన్ను పదకం. ఖలిస్థాన్ ఏర్పాటు కోసం గురుపత్వంత్ సింగ్ పన్నుఇటీవల “రెఫరండం 2020” పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టాడు. లూథియానా కోర్టులో బ్లాస్ట్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బబ్బర్ ఖల్సా ఉగ్రవాది హర్విందర్ సింగ్ సంధు గురించి కూడా సమాచారం లభించింది.

Also read: Wonder Place: సముద్రం మధ్యలో వేలిముద్రలాంటి “ద్వీపం”

ఇక భారత్ లో పేలుళ్లకు ఈ ఉగ్రవాదులు చేసిన వ్యూహరచనను ఆధారాలతో సహా బయటపెట్టిన భారత అధికారులు, వాటిని జర్మనీలోని భారత దౌత్యకార్యాలయానికి చేరవేశారు. దీంతో జర్మనీ ప్రభుత్వం ఉగ్రవాది ముల్తానిని అరెస్ట్ చేసింది. ఈ ఆపరేషన్ సందర్భంగా ఇరు దేశాల దౌత్యాధికారులు, పోలీసులు వారాంతాల్లోనూ కలిసి పనిచేయడం కొసమెరుపు. అంతే కాదు భారత్ ఇచ్చిన ఆధారాలతో, జర్మనీ ప్రభుత్వం మెరుపువేగంతో స్పందించిన తీరు ఇరు దేశాల స్నేహపూర్వక వాతావరణానికి ఉదాహరణగా, ఉగ్రవాద నివారణ చర్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకోవచ్చు.

Also Read: New Year Resolution: కొత్త సంవత్సరంలో మందు మానేద్దామనుకుంటున్నారా?