Shankar-Ram Charan Movie: ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం శంకర్ స్టార్స్ వేట!

వివాదాలెన్ని వచ్చినా తమిళ స్టార్ దర్శకుడు శంకర్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇండియన్-2 సినిమా చేయకుండా మరో ప్రాజెక్టుకు ఎలా వెళ్తారని లైకా ప్రొడక్షన్ కోర్టుకెక్కినా శంకర్ మాత్రం వెనక్కు తగ్గకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టారు.

Shankar-Ram Charan Movie: ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం శంకర్ స్టార్స్ వేట!

Shankar-Ram Charan Movie: వివాదాలెన్ని వచ్చినా తమిళ స్టార్ దర్శకుడు శంకర్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇండియన్-2 సినిమా చేయకుండా మరో ప్రాజెక్టుకు ఎలా వెళ్తారని లైకా ప్రొడక్షన్ కోర్టుకెక్కినా శంకర్ మాత్రం వెనక్కు తగ్గకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక మొదలుపెట్టిన శంకర్ తెలుగుతో పాటు ఇతర బాషల నటీనటులను ఈ సినిమా కోసం తీసుకొచ్చి పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ లుక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర ఇండియన్ బాషల నుండి నటులతో సంప్రదింపులు మొదలుపెట్టారట.

ముఖ్యంగా ఇందులో 30 నిమిషాల నిడివి కలిగిన ఓ పవర్ ఫుల్ పాత్ర ఉందని ప్రచారం జరుగుతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకం కానుందట. అందుకే ఈ పాత్ర కోసం బిగ్ స్టార్ అయితేనే సినిమా స్థాయి పెరుగుతుందని శంకర్ ఆలోచనలో ఉన్నారట. రామ్ చరణ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంతో సన్నిహితంగా ఉంటారు. మరోవైపు శంకర్ అంటే బాలీవుడ్ లో కూడా మంచి క్రేజే ఉంది. ఈక్రమంలోనే చరణ్ సినిమాలో ఆ పవర్ ఫుల్ పాత్ర కోసం హిందీ వెర్షన్ కు సల్మాన్ తో సంప్రదింపులు చేస్తున్నారట.

ఇక తమిళంలో కూడా ఈ పవర్ ఫుల్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విజయ్ సైరా, ఉప్పెనలో మెగా హీరోల సినిమాలలో నటించగా నిహారికతో కలిసి తమిళంలో ఒక సినిమా కూడా చేశాడు. పైగా ఈ మధ్య కాలంలో విజయ్ ఏ పాత్ర చేసినా ఎక్కడలేని గుర్తింపుతో పాటు సినిమా విజయంలో కీలకం అవుతున్నాడు. ఈక్రమంలోనే శంకర్-చరణ్ సినిమాలో తమిళ వెర్షన్ లో విజయ్ కనిపించనున్నాడు. ఇక ఇదే క్రమంలో కన్నడలో కూడా సుదీప్ లేక ఉపేంద్రలను ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నారట.

హిందీ, తమిళ్, కన్నడ బాషలలో ఈ పాత్రలకు కొందరి పేర్లు వినిపించినా తెలుగులో ఈ పాత్ర ఎవరితో చేయించాలన్నది ఆసక్తిగా మారింది. తెలుగులో ఈ పాత్రను చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ తో చేయించాలన్నది అభిమానుల నుండి వస్తున్న అభిప్రాయం కాగా దర్శకుడు శంకర్ మాత్రం రామ్ చరణ్ తోనే మరో కొత్త గెటప్ తో ఆ పాత్రను చేయించి ప్రత్యేకతను చాటుకోవాలని చూస్తున్నాడట. మరి ఫైనల్ గా శంకర్ అనుకున్నట్లుగానే రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తాడా లేక ఆ పాత్రలో మరో క్రేజీ స్టార్ నటిస్తాడా అన్నది చూడాల్సి ఉంది.