Amrnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటి వరకు 33,795 మంది నమోదు: కొనసాగుతున్న బుకింగ్

ఇప్పటివరకు 33,795 మంది అమర్నాథ్ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకున్నారని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి నితీష్వర్ కుమార్ తెలిపారు

Amrnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటి వరకు 33,795 మంది నమోదు: కొనసాగుతున్న బుకింగ్

Amarnath

Amrnath Yatra: భారతీయులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర కోసం బుకింగ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 33,795 మంది అమర్నాథ్ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకున్నారని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) ముఖ్య కార్యనిర్వహణ అధికారి నితీష్వర్ కుమార్ తెలిపారు. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణులలో సహజంగా ఏర్పడిన మంచు-శివలింగాన్నీ దర్శించుకునేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ యాత్రను నిలిపివేశారు. రెండేళ్ల అనంతరం జూన్ 30న యాత్ర తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా భక్తులు టికెట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. 43 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన భక్తి యాత్రగా చరిత్రలో నిలిచిపోయింది. అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సభ్యులు తెలిపిన వివరాలు మేరకు శనివారం(ఏప్రిల్ 16) వరకు 33,795 మంది భక్తులు ఈ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు. 22,229 మంది ఆన్ లైన్ విధానంలో, 11,566 మంది ఆఫ్ లైన్ విధానం (బ్యాంకులు) ద్వారా నమోదు చేసుకున్నారు.

Also read:Rahul Gandhi: దేశంలో 40 లక్షల మంది మృతి చెందారు: కరోనా మరణాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

43 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో ప్రధాన గుహ వద్దకు చేరుకునేందుకు రెండు మార్గాలు ఉంటాయి. దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ లోని పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మీరనున్న సాంప్రదాయ మార్గం లేదా మధ్య కాశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల పొడవనున్న బాల్తాల్ మార్గం మార్గం ద్వారా భక్తులను తరలిస్తారు. కానీ బాల్తాల్ మార్గం నిటారుగా ఉండి..భక్తులు తరలింపుకు కష్టతరంగా ఉంటుంది. కాగా అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తుల కదలికలను గమనించేందుకు ఈ ఏడాది నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. యాత్రలో పాల్గొనే భక్తుల సౌకర్యార్ధం అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 566 శాఖలను తెరిచారు.

Also read:Ice cream idly Video: ఇదేం టేస్ట్ రా నాయన: ఇడ్లీ సాంబార్ తో ఐస్ క్రీం రోల్స్

వీటితో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకు, జమ్ముకశ్మీర్ బ్యాంక్, యస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన నిర్దేశిత బ్రాంచీల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేదా 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, ఆరు వారాల కంటే ఎక్కువ గర్భం ఉన్న మహిళకు యాత్రలో ప్రవేశం ఉండదు. యాత్రకు దరకాస్తు చేసుకునే భక్తులు ఎస్ఎఎస్ బి-నిర్ధారిత ఆసుపత్రుల నుండి తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రం పొందాలి. నాలుగు పాసుపోర్టు ఫోటోలు, రూ .120 రుసుమును సమర్పించాల్సి ఉంటుంది. అయితే యాత్ర కోసం గత ఏడాది రిజిస్టర్ చేసుకుని, యాత్రకు వెళ్లలేని వారు కేవలం రూ.20 మాత్రమే ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

Also read:Hanuman Jayanti: హనుమాన్ జయంతి.. వెల్లివిరిసిన మత సామరస్యం!

యాత్ర కోసం “ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్” ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు అందిస్తున్నామని, రక్షా బంధన్ (ఆగస్టు 11) రోజున యాత్ర ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు 2019లో అమర్నాథ్ యాత్రను మధ్యలోనే రద్దు చేయగా, మహమ్మారి వ్యాప్తి కారణంగా గత రెండేళ్లలో కేవలం సింబాలిక్ యాత్ర మాత్రమే జరిగింది. ఈ ఏడాది యాత్రలో హెలికాప్టర్లలో ప్రయాణించే వారిని మినహాయించి రోజుకి 10,000 మంది యాత్రికులనే తరలించాలని ఎస్ఎఎస్బి నిర్ణయించింది. యాత్రలో భాగంగా బాల్టాల్ నుంచి డోమెల్ వరకు 2.75 కిలోమీటర్ల దూరానికి యాత్రికుల కోసం ఉచిత బ్యాటరీ కారు సేవలను అందించనున్నారు.