Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు..వైద్య ఆరోగ్య శాఖకు వెయ్యి కోట్లు, ఏడు మెడికల్ కాలేజీలు

కరోనా కట్టడిపై చర్చించిన తెలంగాణ కేబినెట్‌.... వైద్య ఆరోగ్యశాఖకు వెయ్యి కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్‌ కాలేజీలకు ఆమోదం తెలిపింది. మహబూబాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు..వైద్య ఆరోగ్య శాఖకు వెయ్యి కోట్లు, ఏడు మెడికల్ కాలేజీలు

Kcr Cabinet

7 Medical Colleges : కరోనా కట్టడిపై చర్చించిన తెలంగాణ కేబినెట్‌…. వైద్య ఆరోగ్య శాఖకు వెయ్యి కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్‌ కాలేజీలకు ఆమోదం తెలిపింది. మహబూబాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినం. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరపాలని నిర్ణయించింది. పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా.. నెక్లెస్‌ రోడ్డుకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మార్గ్‌గా పేరు పెట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక నాసిరకం విత్తనాలు, ఎరువులు, కల్తీ పురుగుమందుల తయారీదారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారుల, హోం శాఖ, ఇంటిలిజెన్స్‌ అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం తొమ్మిది లేదా పది క్లస్టర్లను ఎంపిక చేయాలని.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని కేబినెట్‌ ఆదేశించింది. వరినాట్లు కాకుండా.. వెదజల్లే పద్దతిని అవలంభించాలని.. పొరుగు రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం డిమాండ్‌ రోజురోజుకూ తగ్గుతుండటంతో.. వరి కన్నా పత్తికే ఎక్కువ లాభాలొస్తాయని కేబినెట్‌ అంచనా వేసింది. కందులకు కూడా మార్కెట్లో డిమాండ్‌ ఉందని.. కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు సూచించింది కేబినెట్‌.

రాష్ట్రంలో రైస్‌ మిల్లులను మరింతగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని.. అందుకోసం చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ ఆదేశించింది. ఇక జూన్‌ 15 నుంచి 25వ తేదీ వరకు రైతుబంధు ఆర్థిక సాయాన్ని రైతులకు అందించాలని.. యాసంగిలో జమ చేసిన విధంగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించింది.

Read More : Telangana lockdown Extended : తెలంగాణ లాక్ డౌన్ సడలింపులు..భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతులు