Telangana Podu Lands : పోడు భూముల పోరుకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అవుతున్న కేసీఆర్ స‌ర్కార్

 రాష్ట్రంలో ద‌శాబ్దాలుగా ర‌గులుతున్న పోడు స‌మ‌స్యకు శాస్వత ముగింపు ప‌లికేందుకు కేసీఆర్ స‌ర్కార్ సిద్దమవుతోంది. ఇప్పటికే పోడు సాగుపై ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌తో లెక్కల‌ను సేక‌రించిన ప్రభుత్వం.. త్వర‌లోనే చేప‌ట్టనున్న డిజిట‌ల్ జాయింట్ స‌ర్వేతో అడ‌వి హ‌ద్దుల‌ను తేల్చి... పోడు పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని డిసైడ్ అయ్యింది.

Telangana Podu Lands : పోడు భూముల పోరుకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అవుతున్న కేసీఆర్ స‌ర్కార్

Telangana Podu Lands

Telangana Podu Lands : రాష్ట్రంలో ద‌శాబ్దాలుగా ర‌గులుతున్న పోడు స‌మ‌స్యకు శాశ్వత ముగింపు ప‌లికేందుకు కేసీఆర్ స‌ర్కార్ సిద్దమవుతోంది. ఇప్పటికే పోడు సాగుపై ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌తో లెక్కల‌ను సేక‌రించిన ప్రభుత్వం.. త్వర‌లోనే చేప‌ట్టనున్న డిజిట‌ల్ జాయింట్ స‌ర్వేతో అడ‌వి హ‌ద్దుల‌ను తేల్చి… పోడు పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని డిసైడ్ అయ్యింది. అయితే.. పోడును తేల్చడంపై గ్రౌండ్ లో స‌ర్కార్‌కు అనేక స‌వాళ్ళు స్వాగ‌తం ప‌లక‌నున్నాయి. తెలంగాణ‌లో అడవిలో కొన‌సాగుతున్న పోడు పోరుకు ముగింపు ప‌ల‌కాల‌ని నిర్ణయించింది తెలంగాణ స‌ర్కార్. భూమి హ‌క్కుల కోసం ద‌శాబ్దాలుగా అడ‌విలో కొన‌సాగుతున్న ఆదివాసీల ఆందోళ‌న‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని డిసైడ్ అయిన కేసీఆర్ ప్రభుత్వం.. వేగం పెంచింది. ఇప్పటికే జ‌రిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని… పోడు స‌మ‌స్య ప‌రిష్కారం కోసం వేగంగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోడు భూముల లెక్కలు తేల్చేప‌నికి శ్రీకారం చుట్టిన స‌ర్కార్… రాష్ట్ర వ్యాప్తంగా పోడు సాగు చేసుకుంటున్న వారినుండి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించింది. దీనితోపాటు… పోడు వాస్తవాల‌ను గుర్తించేందుకు గ్రామ క‌మిటీల‌ను సైతం నియ‌మించింది. ఈ క‌మిటీలకు మూడు గ్రామాల‌కో నోడ‌ల్ అధికారిని నియ‌మించింది. డివిజ‌న్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో క‌లెక్టర్‌కు ప‌ర్యవేక్షణ భాద్యత‌ల‌ను అప్పగించింది. ఇప్పటివరకు పోడు సాగుపై ప్రభుత్వానికి 3ల‌క్షల 30 వేల ద‌ర‌ఖాస్తులు అందాయి. అయితే.. ప్రాథ‌మిక‌ ప‌రిశీల‌న‌లో భారీగానే పోడు అక్రమాలు జ‌రిగిన‌ట్లు స‌ర్కార్ గుర్తించింద‌ని స‌మాచారం. ఈ పోడు భూముల‌లో గిరిజ‌నుల‌తో పాటు… గిరిజ‌నేత‌రులు సైతం సాగు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also read : Banglore Dog Burney : ఫైవ్ స్టార్ హోటల్ లో కుక్కకు ఉద్యోగం..చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ హోదా..భారీగా జీతం..!!

ఉమ్మడి ఏపీలో యుపీఏ-1 ప్రభుత్వం ROFR చ‌ట్టం -2006 ప్రకారం.. కొందరు గిరిజ‌నుల‌కు భూమి హ‌‌క్కు ప‌త్రాల‌ను అందించింది నాటి ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్, ఖ‌మ్మం, క‌రీనంగ‌ర్‌, వ‌రంగ‌ల్, నిజామాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల నుంచి లక్షా 83వేల 107 మంది దరఖాస్తు చేసుకోగా.. 93వేల 494 మందికి 3ల‌క్షలకు పైగా ఎక‌రాల పోడు భూములకు అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలను అందించింది అప్పటి ప్రభుత్వం. మరో 8వేల 723 అప్లికేషన్లను మాత్రమే అప్పట్లో పెండింగ్‌ పెట్టారు. ఇప్పుడు మ‌ళ్ళీ పోడు సాగుపై స‌ర్కార్ ధ‌రాఖాస్తులను కోర‌గా… ఏకంగా 3 ల‌క్షల 30 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అంటే… నాటికి.. నేటికి పోడు సాగు పెరిగిందని తెలుస్తోంది. అయితే.. దీనిలో పోడుపై ఆధార‌ప‌డి జీవిస్తున్న నిజ‌మైన గిరిజ‌నులు ఎవ‌రు…? పోడు భూముల‌ను కొల్లగొట్టాల‌ని చూస్తున్న గిరిజ‌నేత‌రులు ఎవ‌రు…? అన్నది సర్కార్ తేల్చాల్సి ఉంది.

పోడు సాగుదారుల సంగతి తేల్చేందుకు సిద్దమైన స‌ర్కార్‌కు క్షేత్రస్థాయిలో స‌వాళ్ళు స్వాగ‌తం ప‌లకనున్నాయి. దీనిలో ప్రధానంగా ద‌శాబ్దాలుగా కొనసాగుతున్న పోడు క‌బ్జాలు ఒక‌టైతే.. భారీ సంఖ్యలో ఉన్న గిరిజ‌నుల్లో గిరిజ‌నులు ఎవ‌రు? గిరిజ‌నేత‌రులు ఎవ‌రు అన్నది గుర్తించ‌డం మరో సవాల్. దీనికి కార‌ణం… త‌ర‌త‌రాలుగా ఆ ప్రాంతంలో ఆదివాసులు కాకుండా… గుత్తికోయ‌లు, ముల్లాలు ఉండ‌టం. ఈ గుత్తి కోయ‌లు, ముల్లాలు.. ఏపీ నుండి వ‌ల‌స వ‌చ్చి ఖ‌మ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లోని అడ‌వుల్లో నివ‌సిస్తున్నారు. వీరికి పోడు భూముల‌పై హ‌క్కులు ఇవ్వొద్దని ఆదివాసీలు వాదిస్తున్నారు. వీరిని అడ్డుపెట్టుకుని గిరిజ‌నేత‌రులు పోడు భూములపై క‌న్నేశారని అంటున్నారు. దీంతో గిరిజ‌నేతరుల గుర్తింపు అధికారుల‌కు స‌వాల్ గా మార‌నుంది.

Also read : Congress: సోనియాగాంధీపై నగ్మ సంచలన వ్యాఖ్యలు.. నా 18ఏళ్ల తపస్సు వృథాయేనా అంటూ ట్వీట్..

అడ‌వి హ‌ద్దులు తేల్చడం సర్కార్‌కు ఎదురయ్యే మరో సమస్య. ఇప్పటికే పలుచోట్ల అట‌వీ, రెవెన్యూ భూముల విషయంలో వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇలా రెవెన్యూ గ్రామాలు, అట‌వీ స‌రిహుద్దుల వివాదాల్లో ఏకంగా 66 ల‌క్ష ఎక‌రాల భూమి వివాదాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ భూమి మాదంటే మాదేనని.. అట‌వీ, రెవెన్యూ శాఖల మ‌ధ్య ఫైటింగ్ జ‌రుగుతోంది. ఎవ‌రికి వారు రికార్డులు చూపిస్తున్నారు. దీంతో.. ఏది అట‌వీ భూమి, ఏది రెవెన్యూ, ఏది దేవాదాయ భూమి.. అన్నది తేలాల్సి ఉంది. దీనిపై త్వర‌లోనే అట‌వీ- రెవెన్యూ శాఖ‌ల‌తో జాయింట్ స‌ర్వే కు సిద్దమవుతోంది ప్రభుత్వం. శాటిలైట్ స‌ర్వే చేయబోతోంది. దీంతో.. ఆ భూమి ఎప్పటినుంచి క‌బ్జాకు గురైంద‌న్నది తేలిపోనుంది. ఇప్పటికే అట‌వీ శాఖ నుంచి ఉప‌గ్రహ చిత్రాల‌ను సేక‌రించిన‌ట్లు తెలుసుస్తోంది.

మొత్తానికి ఏది ఏమైనా… రాష్ట్రంలో పోడు స‌మ‌స్యకు శాశ్వత ప‌రిష్కారం చూపాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు సీఎం కేసీఆర్. దీంతో.. పోడుపై నిగ్గు తేల్చేందుకు సాంకేతిక‌త‌ను వాడుకుంటూ… మ‌రోవైపు క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌తో .. అస‌లైన ఆదివాసుల‌ను గుర్తించ‌నుంది స‌ర్కార్. మ‌రి ప్రభుత్వం అనుకున్న స‌మ‌యానికి.. ఆదివాసీల‌కు భూమిపై హక్కుల‌ను క‌ల్పిస్తుందో లేదో చూడాలి.