Governor Tamilisai: ఢిల్లీకి చేరిన తెలంగాణ పంచాయితీ: అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, రాజకీయ పరిణామాలపైనా అమిత్ షాకు వివరించనున్నారు గవర్నర్ తమిళిసై

Governor Tamilisai: ఢిల్లీకి చేరిన తెలంగాణ పంచాయితీ: అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ

Tamilisai

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆమె..బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను తమిళిసై అమిత్ షాకు వివరించనున్నారు. ఇటీవల గవర్నర్, తెలంగాణ సీఎంలకు మధ్య తలెత్తిన విభేదాలు..రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో గవర్నర్ పాత్రను తగ్గిస్తూ ముఖ్యమంత్రే స్వీయ నిర్ణయాలు తీసుకోవడం, గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై తమిళిసై హోం మంత్రి అమిత్ షాకు నివేదిక ఇవ్వనున్నారు. ఇటీవల గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఇక యాదగిరి గుట్ట ఆలయ సమారోత్సవానికి సైతం గవర్నర్ ను ఆహ్వానించలేదు.

Also Read:Fuel Prices Today : ఆగని పెట్రో బాదుడు.. 16 రోజుల్లో 14 సార్లు పెరిగిన ఇంధన ధరలు

దీంతో ఈ విషయాలన్నీ కేంద్రం వద్ద ప్రస్తావించేందుకు గవర్నర్ తమిళిసై ఢిల్లీకి చేరుకున్నారు. ఇక తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, రాజకీయ పరిణామాలపైనా అమిత్ షాకు వివరించనున్నారు గవర్నర్ తమిళిసై. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఢిల్లీలో పర్యటిస్తున్న తరుణంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీకి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్..ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ కు ఢిల్లీలో దంత చికిత్స చేశారు. పంటి నొప్పి ఎక్కువగా ఉండడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఎంపీలు సహా ఇతర నేతలను కూడా సీఎం కేసీఆర్ కలవలేదు.

Also read:Amaravathi JAC: కేంద్ర మంత్రులు,రాజకీయ ప్రముఖులను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు