Telangana Crops: ఢిల్లీ వైపు, తెలంగాణ రైతాంగం చూపు
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మరోసారి తెలంగాణ రైతాంగం అడుగులేస్తుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో కలిసి తెలంగాణ మంత్రులు, ఎంపీలు చర్చల్లో పాల్గొననున్నారు.

Telangana Farmers
Telangana Crops: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మరోసారి తెలంగాణ రైతాంగం అడుగులేస్తుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో కలిసి తెలంగాణ మంత్రులు, ఎంపీలు చర్చల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు గోయెల్‌ను నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత రెడ్డి, పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ ఎంపీలు కలవనున్నారు.
మరో వారం రోజుల్లో తెలంగాణలో రబీ కోతలు మొదలుకానుండగా.. ధాన్యం కొనుగోళ్లు, దేశవ్యాప్తంగా ఒకే పంటల సేకరణ విధానం అంశాలపై తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రితో చర్చించనుంది.
రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్థానిక ప్రజాపంపిణీ వ్యవస్థ అవసరాలు పోనూ మిగిలిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనంటూ తెలంగాణ డిమాండ్ వినిపిస్తుంది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం ఒత్తిడి పెంచుతుంది.
రబీలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేసీఆర్ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని సేకరించాలని మోదీని కోరారు. దానిని కేంద్రమంత్రికి అందించనున్నారు తెలంగాణ మంత్రుల బృందం.
Read Also : ధాన్యం కొనుగోలు చేయాలని.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
పంటల సేకరణకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేసీఆర్ సూచించారు. జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం కోసం సీఎంలు, వ్యవసాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార శాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.
మొత్తం ధాన్యం సేకరించకుండా ఉంటే కనీస మద్ధతు ధర అనే విషయానికి అర్థం ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. అలా జరిగితే తెలంగాణ రైతులు, వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, జాతీయ ఆహార భద్రతా లక్ష్యానికి కూడా విఘాతం కలిగించినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పండే మొత్తం వరి, గోధుమలను సేకరిస్తున్న తరహాలో తెలంగాణలోనూ సేకరించాలని కేసీఆర్ అన్నారు.
పంటల వైవిధ్యం దిశగా రైతులను ఇప్పటికే పత్తి, ఆయిల్ పామ్, కందులు, తదితర పంటల దిశగా మళ్లించామని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలతో రబీలో వరిసాగు 2021 లోని 52 లక్షల ఎకరాల నుంచి 2022 లో 36 లక్షల ఎకరాలకు తగ్గించింది తెలంగాణ. పంటల వైవిధ్యం దిశగా ప్రయత్నిస్తూనే పండిన ధాన్యం మొత్తాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని లేఖలో వివరించారు.