తెలంగాణలో ఫస్ట్ టైమ్..ట్రాన్స్ జెండర్లతో సీపీ సజ్జనార్ సమావేశం

10TV Telugu News

transgenders commisionaraite Meeting : తెలంగాణా రాష్ట్రంలోనే మొదటిసారి సైబరాబాద్‌ కమిషనర్ సజ్జనార్ ట్రాన్స్‌జెండర్‌ సమావేశమయ్యారు. వారి సమస్యలపై ఓ డెస్క్ శుక్రవారం (ఫిబ్రవరి 19,2021) ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లతో ఇంటర్‌ఫేస్‌లో కమిషనర్‌ సజ్జనార్‌ సమావేశమై..వారి సమస్యల గురించి చర్చించారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతాకృష్ణన్‌ అభ్యర్థనపై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి 150 మంది ట్రాన్స్‌జెండర్ల హాజరయ్యారు.

ట్రాన్స్ జెండర్ల సమావేశంలో సునీతాకృష్ణన్‌ మాట్లాడుతూ..ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉపాధి, అద్దెకు ఇళ్ళు, సన్నిహిత భాగస్వామి హింస, వారిపై జరుగుతున్న వేధింపులు వంటివి ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఈ డెస్క్‌ ద్వారా కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సమావేశంలో సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్లు, వారి సంఘం ప్రజల్ని వేధించడం గానీ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు గానీ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

అలాగే ప్రజలకు ట్రాన్స్‌జెండర్ల వల్ల ఎటువంటి సమస్యలు ఎదరైనా డయల్‌ 100కు, వాట్సప్‌ నంబర్‌ 9490617444 ద్వారా తెలియజేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ల సమస్యలపై పలు విధాలుగా చర్చించారు. ఈ సమావేశంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, శంషాబాద్‌ డీసీపీ ఎన్‌. ప్రకాశ్‌రెడ్డి, డబ్ల్యూసీఎస్‌డబ్ల్యూ విభాగం డీసీపీ సి.అనసూయ, ఏడీసీపీ క్రైమ్‌ కవిత, పలువురు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, నగరం నుంచి వచ్చిన పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు. వారి వారి సమస్యలను చెప్పుకున్నారు. మాకంటూ సమాజంలో ఓ గుర్తింపు కావాలని మా సమస్యలు పరిష్కరించాలని కోరారు.

అలాగే ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. పద్మశ్రీ అవార్డుగ్రహీత సునీతకృష్ణన్‌ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేసిన క్రమంలో దానికి స్పందించిన మంత్రి రీ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై సమగ్ర పథకానికి నివేదిక సిద్ధం చేశారని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. ఈక్రమంలో ట్రాన్స్‌జెండర్‌ సమస్యను తన దృష్టికి తెచ్చినందుకు మంత్రి సునీతా కృష్ణన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంపై సీఎస్‌తో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.