KBC: కోటి గెలిచిన అంధురాలి కథ.. విధిని జయించిన స్ఫూర్తి గాథ!

విధి ఆమె పాలిట శాపంగా వేధించినా ఆమె విధిని జయించింది. ఆమె మేధస్సు ముందు దృష్టిలోపం కూడా తలవంచింది. కోటి రూపాయల విజేతగా ఎన్నో హృదయాలను గెలుచుకున్నారు.

KBC: కోటి గెలిచిన అంధురాలి కథ.. విధిని జయించిన స్ఫూర్తి గాథ!

Kbc

KBC: విధి ఆమె పాలిట శాపంగా వేధించినా ఆమె విధిని జయించింది. ఆమె మేధస్సు ముందు దృష్టిలోపం కూడా తలవంచింది. కోటి రూపాయల విజేతగా ఎన్నో హృదయాలను గెలుచుకున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా హిందీలో ప్రసారం అవుతోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి దేశ వ్యాప్తంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు లక్షల్లో అభిమానులుంటే ఎందరో ఎన్నో ఏళ్లుగా ఈ షోలో అవకాశం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అలా వచ్చిన అవకాశాన్ని వందకు వంద శాతం ఉపయోగించుకున్నారు హిమనీ బుందేలా.

కేబీసీ ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో తాజాగా హిమానీ బుందేలా అనే యువతి పాల్గోని కోటీ రూపాయలు గెలిచుకున్నారు. ఈ సీజన్ లో కోటి గెలుచుకున్న మొదటి విజేత కూడా ఈ యువతే. ఆగ్రాకు చెందిన 25 ఏళ్ల బుందేలా ఇంటర్‌లో ట్యూషన్‌కి వెళుతుండగా బైక్‌ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె చూపు తగ్గింది. నాలుగు ఆపరేషన్లు చేసినా స్పష్టమైన చూపు తిరిగిపొందలేకపోయారు. అలా దృష్టి లోపంతో పోరాడుతూనే ఈ పోటీలో కరోడ్ పతిగా గెలవడం విశేషం. అందుకే ఆమె కోటి మాత్రమే కాదు దేశంలో ఎందరో మనసులను గెలుచుకున్నారు.

లోపం మనిషికే కానీ మేధస్సుకి కాదని తెలుసుకోవాల్సింది ఇంకా మిగిలే ఉందని ఆమెని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అంధకారం అలుముకున్న ఆమె జీవితాన్ని చిరు నవ్వుతో ఎదిరించిన తీరుని చూసి మనల్ని మనం తరచి చూసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ అన్ని సీజన్లలో కోటి రూపాయలు గెలిచిన తొలి అంధ విజేత హిమానీ బుందేలానే కాగా.. అంధురాలి నుండి హాట్ సీట్ దాకా.. వెక్కిరింతల నుండి కరోడ్ పతి దాకా విధిని జయించిన ఆమె స్ఫూర్తి గాథను మన జీవన గమనంలో మార్గదర్శకంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని స్పృశిస్తుంది.

ఆమె జయించిన విజయం ఆమెకేదో గాలి వాటంగా రాలేదు.. కంటి చూపు బలహీనంగా ఉందని చిన్నప్పుడే నిర్ధారణైనా కృంగిపోలేదు. వైద్యులు చెప్పిన సత్యం జీవితాన్ని వెనక్కు లాగేయకూడదని భయపడుతూనే ముందడుగేసింది. చదువుతో పాటు తోటి పిల్లలకు ట్యూషన్లు చెప్తూ మేధస్సును పెంచుకోసాగింది. కానీ భయపడిందే జరిగింది. ప్రమాదంలో బలహీనంగా ఉన్న చూపు పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. అందుకు ఆమె కృంగిపోలేదు. ఇన్నాళ్లు చూపు పోతే ఎలా అని భయపడి ఆగిపోవాల్సి వచ్చేది. కానీ, జరగాల్సిన నష్టం జరిగాక పోయేదేముందని ధైర్యంగా ముందుకు సాగింది. అదే ఆమెను విజేతను చేసింది.

ప్రమాదానికి ముందున్న భయాన్ని శక్తిగా మార్చిన హిమానీ ఎక్కడా ఏ కన్ఫ్యూజనూ లేకుండా ముందుకు వెళ్లడం నేర్చుకున్నారు. అదే స్పష్టమైన దృష్టితో ట్యూషన్లు మళ్ళీ మొదలు పెట్టడంతో పాటు దివ్యాంగ విద్యార్థులను మామూలు విద్యార్థులతో కలిపి చదివించే డాక్టర్‌ శకుంతల మిశ్రా రిహాబిలిటేషన్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ తీసుకున్నారు. కేంద్రీయ విద్యాలయలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఇంట్లోనే తొలి ప్రభుత్వ ఉద్యోగిగా తొలి సక్సెస్ దక్కించుకున్నారు. ప్రతి సీజన్ కేబీసీకి ఆమె రిజిస్ట్రేషన్, ప్రిపరేషన్ సాధారణం కాగా ఈసారి హాట్ చైర్ దక్కింది. దక్కిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకొని దేశాన్ని తనవైపు చూసేలా చేసుకున్నారు. గెలిచిన కోటిని దివ్యంగుల ప్రభుత్వ ఉద్యోగాల కోచింగ్ కోసం ఖర్చు చేస్తానంటూ కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు.