TRS Delhi Dharna : మా దీక్షను చిన్న చూపు చూస్తే కేంద్రానికే నష్టం-నిరంజన్ రెడ్డి

కేంద్రం.. తెలంగాణ పట్ల కక్ష పూరిత ధోరణి ఎందుకు అవలంభిస్తుందో అర్థం కావడం లేదన్నారు. మా దీక్షను చిన్న చూపు చూస్తే..

TRS Delhi Dharna : మా దీక్షను చిన్న చూపు చూస్తే కేంద్రానికే నష్టం-నిరంజన్ రెడ్డి

Trs Delhi Dharna

TRS Delhi Dharna : కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ధాన్యం దంగల్ కొనసాగుతోంది. వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రంపై ఒత్తి పెంచేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా నిరసన దీక్షకు సిద్ధమైంది.

సోమవారం ఢిల్లీలో తెలంగాణ రైతుల పక్షాన ప్రజా ప్రతినిధులు నిరసన దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాట్లను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఒకే విధానంలో పంటల సేకరణ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. బియ్యంతో లింకు పెట్టొద్దని కోరారు. వరి పండించే ఏ ఒక్క రాష్ట్రం బీజేపీ చేతిలో లేదని గుర్తు చేశారు. పంజాబ్ లో ఏ విధంగా అయితే వరి కొనుగోలు చేస్తున్నారో అదే తరహాలో తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.(TRS Delhi Dharna)

Paddy Issue : ధాన్యం దంగల్.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష

వరి ధాన్యం సేకరణ చేయాలి తప్ప బియ్యం సేకరిస్తామనడం సరికాదన్నారు. కేంద్రం.. తెలంగాణ పట్ల కక్ష పూరిత ధోరణి ఎందుకు అవలంభిస్తుందో అర్థం కావడం లేదన్నారాయన. తెలంగాణ ప్రజా ప్రతినిధులు అందరూ ప్రభుత్వ పక్షాన దీక్ష చేపడుతున్నామని తెలిపారు. మా దీక్షను చిన్న చూపు చూస్తే అది కేంద్రానికే నష్టం అన్నారు. రైతులను చిన్న చూపు చూసిన ప్రభుత్వాలు బాగుపడలేదని నిరంజన్ రెడ్డి చెప్పారు. తదుపరి కార్యాచరణ సోమవారం ప్రకటిస్తామన్నారు.

యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం తీరుకి నిరసనగా ఇప్పటికే ఆందోళన బాట పట్టిన టీఆర్ఎస్.. మరో అడుగు ముందుకేసి దేశ రాజధానిలో దీక్షకు సిద్ధమైంది. సోమవారం తెలంగాణ భవన్ వేదికగా జరిగే ఈ దీక్షలో పలువురు తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఈ నెల 4వ తేదీ నుంచి టీఆర్‌ఎస్‌ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ఏకంగా ఢిల్లీ వేదికగా దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షలో పాల్గొనేందుకు ఢిల్లీకి రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు, కార్పొరేషన్‌ ఛైర్మన్లతో పాటు టీఆర్ఎస్ కీలక నేతలను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.

Kalvakuntla Kavitha: కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పు: ఎమ్మెల్సీ కవిత

అయితే, ఢిల్లీలో దీక్ష చేపట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకపోతే ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ రాగానే మంత్రిమండలి సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యాసంగిలో పండే ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పడం దారుణమం అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఉప్పుడు బియ్యం ఇవ్వొద్దని తమ మెడపై కత్తి పెట్టి కేంద్రం రాయించుకుందని ఆరోపించారు. కేంద్రానికి చెప్పాల్సిన విధంగా పార్లమెంటులో చెప్పామని, కేంద్రం తీరు పాసిస్ట్ పద్దతిగా ఉందని ధ్వజమెత్తారు.