Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ తనపై చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. లిక్కర్ స్కామ్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

kavitha gave clarity on the allegations on her over delhi liquor scam
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ తనపై చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై నాకు ఎటువంటి సంబంధం లేదని కవిత స్పష్టంచేశారు. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ..కేసీఆర్ ను మానసికంగా ఇబ్బంది పెట్టటానికి కుట్ర చేస్తోంది అంటూ ఆరోపించారు. నాపై ఆరోపణలు చేస్తే కేసీఆర్ భయపడతారని బీజేపీ అనుకుంటే అదొక ఒట్టి భ్రమ మాత్రమేనని..అది ఎన్నటికీ జరగదని ఇటువంటివి కేసీఆర్ చాలానే ఎదుర్కొన్నారు అంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనపై ఆరోపణలను నిరూపించటానికి ఎటువంటి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపినా తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు కవిత. తనపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేసిన బీజేపీపై పరువు నష్టం దావా వేస్తానని కవిత తెలిపారు. తనపై వచ్చిన అవాస్తవ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతు కవిత కోర్టు మెట్లెక్కనున్నారు. దీని కోసం కవిత న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం ఉందని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీజేపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలకు తెర తీశారని, బట్ట కాల్చి మీద వేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎవరి మీద పడితే వారి మీద ఆరోపణలు చేయడం సరైనది కాదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.కేసీఆర్ బిడ్డను ఆరోపణలతో బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారని ఇటువంటి ఆలోచన చేస్తున్నారని..బీజేపీ పిచ్చి ఆలోచనలు ఎన్నటికి నెరవేరవని అన్నారు. ఇక ఇటువంటి ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం గానే మిగిలిపోతుందని, మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు, ప్రభుత్వం పోరాట పటిమ ఉన్నవారిమని..భయపడి వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించటానికి ఎంతగా పోరాటం చేశామో..అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోరాటం చేస్తామన్నారు.
మాపై ఎన్ని ఆరోపణలు చేసినా మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. ఇక ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎండగడుతూ ఉన్నారు కాబట్టే ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కవిత మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసనీ..పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని కవిత స్పష్టం చేశారు. ఈ విషయంలో దర్యాప్తుకు తాను సహకరిస్తానని అంటున్న కవిత..తనకు ఎలాంటి సంబంధం లేని వ్యవహారంలో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.