TSRTC: డీజిల్ బస్సులపై టీఎస్‌ఆర్టీసీ ప్రయోగాలు.. ఎలక్ట్రిక్‌గా మార్చే ఆలోచన!

డీజిల్ భారాన్ని తగ్గించేందుకు కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది తెలంగాణ ఆర్టీసీ. కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులకు కొనకుండానే.. ఉన్న బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చాలని భావిస్తోంది.

TSRTC: డీజిల్ బస్సులపై టీఎస్‌ఆర్టీసీ ప్రయోగాలు.. ఎలక్ట్రిక్‌గా మార్చే ఆలోచన!

Ts Rtc

TSRTC: డీజిల్ భారాన్ని తగ్గించేందుకు కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది తెలంగాణ ఆర్టీసీ. కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులకు కొనకుండానే.. ఉన్న బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చూడుతోంది. కొత్త ప్రయోగం సక్సెస్ అయితే.. మరిన్ని బస్సులను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది టీఎస్‌ ఆర్టీసీ.

తెలంగాణ ఆర్టీసీ డీజిల్ భారం నుంచి బయటపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయోగాల్లో భాగంగా డీజిల్‌తో నడిచే బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సులు రన్నింగ్‌లోకి వచ్చిన తర్వాత.. కొన్నాళ్లు పరిశీలించి, దానిపై ఓ అభిప్రాయానికి వస్తామని ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. డీజిల్‌తో పోలిస్తే ఖర్చు ఎంత తగ్గుతోంది? ట్రాఫిక్‌లో ఆ బస్సుల పనితీరు ఎలా ఉంటుంది? పెట్టిన ఖర్చుకు మించి రాబడి ఉంటుందా? లేదా? అనే అంశాలను పరిశీలించబోతుంది.

ఒకవేళ అవి సక్సెస్‌ అయితే.. మరిన్ని బస్సులను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే అవకాశం కనిపిస్తుంది. ఒక్కో బస్సును ఎలక్ట్రిక్‌ బస్సుగా మార్చేందుకు 60 నుంచి 65లక్షల వరకూ ఖర్చు అవుతుంది.

అయితే, మొదటి బస్సుకు మాత్రం పూర్తి ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది ఓ ప్రైవేటు సంస్థ. ఆ బస్సు పనితీరు మెరుగ్గా ఉంటే, గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని 2వేల 8వందల ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం బస్సులను దశలవారీగా ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చే ఆలోచనలో తెలంగాణ RTC ఉంది.

ప్రస్తుతం నగరంలో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తుండగా.. అవి కేవలం విమానాశ్రయానికి వచ్చిపోయే వారికి మాత్రమే సేవలందిస్తున్నాయి. వాటికి భిన్నంగా ఈ బస్సు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండబోతుంది.

ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోన్న ఆర్టీసీ.. కార్మికుల జీతాల తర్వాత అంత వ్యయం డీజిల్ కోసమే ఖర్చు చేస్తోంది. జీతాలను తగ్గించడం అంత సులభం కాని క్రమంలో డీజిల్‌ ఖర్చులను తగ్గించే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్‌ బస్సుల వైపు మొగ్గు చూపింది RTC.

ఎలక్ట్రిక్‌ బస్సుకు కిలోమీటర్‌కు కేవలం 6 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని, అదే డీజిల్ అయితే 20 రూపాయల ఖర్చు అవుతోందని చెబుతున్నారు. అంటే.. ప్రతీ కిలోమీటరుకు 14 రూపాయలు మిగిలించే అవకాశం ఉందన్నమాట.

ఎలక్ట్రిక్‌ బస్సుల ధర ప్రస్తుతం మార్కెట్‌లో రెండు కోట్ల రూపాయల వరకూ ఉంది. అంత వ్యయాన్ని భరించే పరిస్థితి ప్రస్తుతం ఆర్టీసీకి లేదు. దీంతో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మర్చే ఆలోచనలోనే ఉంది తెలంగాణ ఆర్టీసీ.