Turmeric : పసుపుతో క్యాన్సర్ చికిత్స సాధ్యమేనా!..

పురాతన కాలం నుంచి పసుపు మన జీవితాలలో భాగమైపోయింది. తాపనివారణ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్‌ వరకు దీనిలోని ఔషధగుణాలను సైతం గుర్తించారు.

Turmeric : పసుపుతో క్యాన్సర్ చికిత్స సాధ్యమేనా!..

Turmeric

Turmeric : ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. ఎంతో మంది దీని బారిన పడి బలైపోతున్నారు. క్యాన్సర్ చికిత్సకోసం ప్రస్తుతం అధునాతన పద్దతులు ఉపయోగిస్తున్నప్పటికీ, మనం నిత్యం సాంప్రదాయబద్ధంగా వినియోగించే వస్తువులతో సైతం క్యాన్సర్ ను నిరోధించవచ్చని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఆ పరిశోధనలు ఇంకా పూర్తి స్ధాయిలో ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈక్రమంలో ముఖ్యంగా మనం నిత్యం వినియోగించే పుసుతో క్యాన్సర్ నివారణ సాధ్యమని శాస్త్రవేత్తలు గుర్తించారు.

పురాతన కాలం నుంచి పసుపు మన జీవితాలలో భాగమైపోయింది. తాపనివారణ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్‌ వరకు దీనిలోని ఔషధగుణాలను సైతం గుర్తించారు. తాజాగా వివిధ రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో పసుపు ఏ విధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై అనేక పరిశోధన అధ్యయనాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. దీర్ఘకాలిక తాపం, క్యాన్సర్ అభివృద్ధికి మధ్య సహసంబంధం ఉన్నందువల్ల, పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వ్యాధితో పోరాడడంలో ప్రయోజనకరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికాలోని సౌత్ డకోటా స్టేట్ వర్సిటీ ప్రొఫెసర్ , భారతీయ శాస్త్రవేత్త అయినా హేమ చందు తుమ్మల జీర్ణాశయ క్యాన్సర్ చికిత్సలో పసుపును వినియోగించే పద్ధతిని అభివృద్ధి చేసి సక్సెస్ అయ్యారు.

పసుపులో ఉండే కర్కమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. 2019లో న్యూట్రియంట్స్‌ అనే సైంటిఫిక్‌ జర్నల్‌ ప్రచురించిన నివేధికలో సైతం పసుపు రొమ్ము క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తుందని, కణితి పెరుగుదల మందగించేలా ప్రేరేపిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా ఊపిరితిత్తులు, పెద్దపేగు, క్లోమం వంటి కొన్ని ఇతర రకాల క్యాన్సర్లకు చికిత్సగా పసుపును వినియోగించడంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెల్పింది. టెస్ట్ ట్యూబ్, జంతు అధ్యయనాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు ఈ నివేదిక తెల్పింది. అయితే నేటికి ఈ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

క్యాన్సర్ చికిత్సలో పసుపును ఉపయోగించడంలో అతిపెద్ద అడ్డంకి ఏంటంటే.. పసుపును ఎక్కువ మోతాదులో మానవ శరీరం గ్రహించలేకపోవడం. ఈ అడ్డంకిని అధిగమించడానికి ఫార్మకాలజిస్టులు కృషి చేస్తున్నారు. ఐతే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకు… పసుపును క్యాన్సర్‌కు చికిత్సగా ఉపయోగించాలంటే పరిశోధనలు పూర్తిస్ధాయిలో ఫలితాలను వెల్లడిస్తే తప్ప కుదరదని చెబుతున్నారు.