Heart : గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా!

తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటలలోపు మానవశరీరాన్ని ఉల్లాసంగా ఉంచే హార్మోన్స్‌ విడుదలవుతాయి. రాత్రి విధులు నిర్వహించే వారు ఆ సమయంలో నిద్రిస్తుండటం వల్ల ఈ హార్మోన్స్‌ విడుదలకు అవకాశం లేకుండా పోతుంది.

 Heart : గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా!

Heart

Heart  : జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల గుండెపై ఒత్తిడి పెరిగింది. ప్రతియేటా గుండె జబ్బులు, మరణాలు పెరుగుతున్నాయి. ప్రతిరోజు రెండు వేల గ్యాలన్ల రక్తాన్ని శుద్ధి చేసి, 60వేల మైళ్ల దూరం వరకు ప్రవహించేలా పంపింగ్‌ చేసే పిడికెడు గుండె ఆధునిక మనిషి వేగాన్ని అందుకోలేకపోతుంది. చాలా మంది గుండె ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొంత మంది సరైన అవగాహన లేకపోవటంతో గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

ప్రతి రోజు గుండె సరఫరా చేసే రక్తం 7,500 లీటర్లు. రోజులో గుండె లబ్‌డబ్‌ల సంఖ్య 1.15 లక్షలుగా ఉంటుంది. నిద్రిస్తున్నసమయంలో గుండె లబ్‌డబ్‌లు 60శాతం తగ్గుతాయి. మనిషి బరువులో గుండె 0.3శాతం ఉంటుంది. మహిళల కంటే పురుషుల గుండె బరువు అధికం. పురుషుల గుండె కంటే మహిళల గుండే వేగంగా కొట్టుకుంటుంది. వయస్సు పెరగడం, లింగభేదం, వారసత్వం వంటి వాటి కారణంగా వచ్చే గుండె జబ్బులు కొన్నైతే, మన అలవాట్ల కారణంగా వచ్చే గుండె జబ్బులు మరికొన్ని…మహిళలకు మెనోపాజ్‌ దశ వరకు గుండెపోటు వచ్చే అవకాశాలు స్వల్పం. మద్యం, పొగ తాగడం, ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించకుంటే స్త్రీలకు కూడా గుండె జబ్బులు తక్కువ వయస్సులో రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

షుగర్‌, బీపీ, మద్యం, గంజాయి, పొగతాగడం, గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు నమలడం, విపరీతంగా తినడం, తగిన శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటివి గుండె జబ్బులను తెచ్చిపెడుతున్నాయి.భారతదేశంలో గుండె జబ్బులు చాలా తక్కువ వయస్సులో వస్తున్నాయి. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. 30 ఏళ్లలోపు వారు కూడా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, రాత్రిపూట విధులు నిర్వహించేవారు ఎక్కువగా ఉంటున్నారు.

తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటలలోపు మానవశరీరాన్ని ఉల్లాసంగా ఉంచే హార్మోన్స్‌ విడుదలవుతాయి. రాత్రి విధులు నిర్వహించే వారు ఆ సమయంలో నిద్రిస్తుండటం వల్ల ఈ హార్మోన్స్‌ విడుదలకు అవకాశం లేకుండా పోతుంది. హృద్రోగాలకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడిగా చెప్పవచ్చు. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండటం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగవచ్చు. ఇలాంటి వారికి అవసారిన్ని బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియో ప్లాస్టీ చేస్తారు.

గుండె పదికాలాలు భద్రంగా ఉండాలంటే తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పీచుపదార్థం, మంచి కొలెస్ట్రాల్‌, యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు శ్రీరామ రక్ష. మాంసహారం తినేవారు వీలైనంత ఎక్కువగా చేపలు తింటే ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల రూపంలో మంచి కొవ్వులు అందుతాయి. శాకాహారులైతే అవిశలు, వాల్‌ నట్స్‌, బాదం వంటివి తీసుకోవడం మేలు. ఇంట్లో వాడే నూనెలను తరచూ మారుస్తూ ఉంటే మంచి కొవ్వులు శరీరానికి అందుతాయి. పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉత్పత్తై శరీరానికి మేలు చేస్తాయి.