ఇండియా ఓల్డెస్ట్ చింపాజి : ఢిల్లీ జూలో 59ఏళ్ల ‘రీటా’ మృతి

  • Published By: sreehari ,Published On : October 2, 2019 / 12:04 PM IST
ఇండియా ఓల్డెస్ట్ చింపాజి : ఢిల్లీ జూలో 59ఏళ్ల ‘రీటా’ మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని జూలో 59ఏళ్ల (రీటా) చింపాజీ  మరణించింది. రెండు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రీటా మంగళవారం (అక్టోబర్ 1, 2019) ఆమ్‌స్టర్‌డామ్‌ జూలో మధ్యాహ్నాం 12.15 గంటల ప్రాంతంలో ప్రాణాలు విడిచినట్టు ఢిల్లీ జూ అధికారులు తెలిపారు. చింపాజి రీటా.. 1960, డిసెంబర్ 12న జన్మించింది. 1960లో ఢిల్లీలోని ఆమ్‌స్టర్‌డామ్‌ జూకు చింపాజీని తరలించారు. అప్పుడే ఈ చింపాజీకి రీటా అని పేరు పెట్టారు.

1960 నుంచి అదే జూలో ఉంటూ అక్కడికి వచ్చే పర్యాటకులను రీటా ఎంటర్ టైన్ చేస్తోంది. ఇండియాతో పాటు ఆసియాలో కూడా అతిపెద్ద వయస్సు ఉన్న చింపాజిగా రీటా లిమ్కా బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. సాధారణంగా చింపాజీల సగటు జీవితకాలం కేవలం 50ఏళ్లు మాత్రమే. సుమారు 59 ఏళ్లుగా ఢిల్లీ జూలో ఉంటున్న రీటా చింపాజీ అనారోగ్యంతో మృతిచెందడంపై జూ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. రీటా మరణంతో ఢిల్లీ జూలో నిర్వహించాల్సిన వైల్డ్ లైఫ్ వీక్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు.

అనారోగ్యం కారణంగా రీటా జూలై 27 నుంచి సరిగా ఆహారం తీసుకోవడం లేదు. అప్పటి నుంచి ద్రవరూపంలో రీటాకు ఆహారాన్ని అందిస్తున్నారు. ‘రీటా.. పండ్ల జ్యూస్, కొబ్బరి నీళ్లు, పాలు తాగుతోంది. బాదం పప్పులు, అక్రోటు కాయలతో ఆహారంగా అందిస్తున్నాం. దిండు, దుప్పటి, మ్యాట్రస్, ఎయిర్ మ్యాట్రస్, వాటర్ బెడ్, వీడియోలు చూసేందుకు టీవీ కూడా ఏర్పాటు చేశాం’ అని ఢిల్లీ జూ క్యురేటర్ రియాజ్ ఖాన్ తెలిపారు. జంతు వైద్యాధికారుల ప్యానల్ పర్యవేక్షణలో రీటాకు పోస్టుమార్టం నిర్వహించారు. చింపాజీ రీటా మృతికి.. బహుళ అవయవాలు చెడిపోవడం వల్లే జరిగిందని రిపోర్టులో నిర్ధారించారు. 

గత వారమే జంతు సంరక్షణ కార్యకర్త అయిన ఒక మహిళ చింపాజీ రీటా ట్రీట్ మెంట్ విషయంలో జూ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు.. రీటా కనిపించేలా జూలో సీసీ కెమెరాలను అమర్చారు. చింపాజీని జూ సిబ్బంది ఎలా చూసుకుంటున్నారో ప్రతిఒక్కరూ చూసేందుకు వీలుగా గేటు బయట వైపు 55 అంగుళాల టీవీని కూడా ఏర్పాటు చేశారు. ఈ టీవీకి సీసీ కెమెరాను అనుసంధానం చేశారు.