Teen Depression : టీనేజర్లలో డిప్రెషన్.. కాస్త కనిపెట్టుకుని ఉండండి

డిప్రెషన్ ఇటీవల కాలంలో పెద్దల్ని.. పిల్లల్ని పట్టి పీడిస్తున్న మానసిక ఆరోగ్య సమస్య.. టీనేజర్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. టీనేజర్లలో డిప్రెషన్‌కి కారణాలు ఏంటి? పేరెంట్స్ ఎలా కనిపెట్టాలి?

Teen Depression : టీనేజర్లలో డిప్రెషన్.. కాస్త కనిపెట్టుకుని ఉండండి

Teen depression

Teen depression : పట్టుమని 16 సంవత్సరాలు లేకుండానే జీవితం పట్ల నిరాశ. భవిష్యత్ అంటే భయం.. ఈ జీవితం ఎందుకనే విరక్తి. చివరికి బలవంతంగా చావును కోరుకోవడం. నటుడు విజయ్ ఆంటోనీ డాటర్ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుందనే వార్త సంచలనం రేపుతోంది. టీనేజర్స్‌లో డిప్రెషన్‌కి కారణం అనారోగ్య సమస్యలా? చదువుల వల్ల పెరిగిన విపరీతమైన ఒత్తిడా? లేక వ్యక్తిగత కారణాలా?  అసలు పేరెంట్స్ కనిపెట్టుకుని ఉంటున్నారా?

Vitamin D : విటమిన్ డి లోపంతో డిప్రెషన్‌ సమస్యకు గురికావాల్సి వస్తుందా?

డిప్రెషన్ అనేది తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. డిప్రెషన్‌లో ఉండేవారు ఎప్పుడూ విచారంలో ఉంటారు. చేసే పని మీద ఆసక్తి చూపించరు. అయితే టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్‌కి పెద్దవారిలో డిప్రెషన్‌కి తేడాలు ఉంటాయి. చదువు విషయంలో ఒత్తిడి కావచ్చు.. యుక్త వయసులో ఫిజికల్‌గా వచ్చే మార్పులు కావచ్చు.. కుటుంబంలో సమస్యలు కావచ్చు.. టీనేజర్లలో కనిపించే డిప్రెషన్ తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. మందులు, కౌన్సిలింగ్ వంటి చికిత్సలతో ఆ లక్షణాలు తగ్గించవచ్చు అని చెబుతున్నారు. అసలు వాళ్లు డిప్రెషన్‌లో ఉన్నారని కనిపెట్టడం ఎలా? ఈ మార్పులు వస్తే కనిపెట్టుకోమని వైద్యులు చెబుతున్నారు.

డిప్రెషన్‌లో ఉన్న టీనేజర్ల ప్రవర్తనలో విపరీతమైన మార్పు కనిపిస్తుందట. కారణం లేకుండా విచారంగా ఉండటం.. విరక్తిగా మాట్లాడటం.. ఏడ్వడం చేస్తుంటారట. చిన్న చిన్న విషయాలకు చిరాకు పడటం.. కోపం తెచ్చుకోవడం చేస్తారట. రోజువారి పనుల్లో కూడా ఆసక్తి చూపించకపోవడం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య కలవకపోవడం, తనను తను తక్కువగా అంచనా వేసుకోవడం, తప్పు చేసాననే భావనలో ఉండటం ముఖ్యంగా వీరిలో కనిపించే లక్షణాలట. ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉండటం, ఏకాగ్రత కోల్పోవడం, అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం.. విషయాలను గుర్తు పెట్టుకోవడంలో ఇబ్బంది పడటం, చివరికి ఆత్మహత్య గురించి ఆలోచన చేయడం వీరిలో కనిపించే లక్షణాలట.

Ira Khan : అమ్మా నాన్న‌ల విడాకులు.. రోజులో 8 గంట‌లు ఏడుపు..10 గంట‌లు నిద్ర‌.. మందులు మానేశా.. ఏడాదిన్నరపాటు డిప్రెషన్‌

టీనేజర్లలో డిప్రెషన్‌లో ఉండేవారు ఎక్కువగా నిద్రపోవడం.. లేదంటే అసలు నిద్రపోకపోవడం చేస్తుంటారట. మద్యం, లేదా మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం.. ఒక చోట స్థిరంగా కూర్చోలేకపోవడం, అందరిలో కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం, ఏదో ఒక వంకతో స్కూలు, కాలేజీలు మానేయడం, తమను తమను పట్టించుకోకపోవడం, తమకు తాము హాని చేసుకోవడం వంటి విపరీతమైన ప్రవర్తన కనిపిస్తుందట.  ఇలాంటి ప్రవర్తన కనిపించిన వెంటనే కుటుంబ సభ్యులు వారిని వైద్యులకు చూపించాలి.  సరైన సమయంలో చికిత్స చేయకపోతే వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయని  వైద్యులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాల్లో పిల్లలు తమ ఆశలు నెరవేరక డిప్రెషన్ బారిన పడుతుంటే.. సంపన్నులైన కుటుంబాల్లో పిల్లలు బలవన్మరణాలకు పాల్పడటం షాక్‌కి గురిచేస్తోంది. తెల్లారి లేస్తే కుటుంబం సభ్యులు తమ పనుల్లో బిజీ బిజీగా పరుగులు తీస్తున్నారు. తమ పిల్లలకు కావాల్సిన అన్నీ అందిస్తున్నామని వారికి ఏ లోటు చేయట్లేదని భావిస్తున్నారు. స్కూలు, ట్యూషన్లలో చదువుల ఒత్తిడి.. ఇంట్లో ఆలనా పాలనా చూసే ఆయాలు, పనివారు తమ పిల్లలు హ్యాపీగా ఉన్నారని పేరెంట్స్ అనుకోవచ్చు. కానీ వారు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ప్రేమ, ఆప్యాయత, మానసిక ధైర్యం అందించలేకపోతున్నారు. ఇదే వారిని చిన్నవయసులో నైరాశ్యంలోకి నెట్టేస్తోందని మానసిక వైద్యులు చెబుతున్నారు.

Prevent Postpartum Depression : ప్రసవానంతరం తల్లులలో డిప్రెషన్‌ను నివారించే ఆహారాలు !

కుటుంబ సభ్యులు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా తమ పిల్లలను ఓ కంట కనిపెట్టుకోవాలి. సరైన సమయంలో వారిలో డిప్రెషన్ గుర్తించగలిగితే త్వరగా నయం అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పేరెంట్స్ కష్టపడేది పిల్లల భవిష్యత్ కోసమే.. పిల్లల సంతోషం కోసమే. కానీ పిల్లలు సంతోషంగా లేకపోతే..? వారి కోసం కాస్త సమయం ఇవ్వండి. వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండండి.. వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. సరైన సమయంలో మీ భరోసా వారికి దొరికితే ఎలాంటి సమస్యలు వారి దరి చేరవు.