Computer Work : గంటలకొద్దీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతో గడిపేవారికి వచ్చే వ్యాధులు ఇవే!…

మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది.

Computer Work : గంటలకొద్దీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతో గడిపేవారికి వచ్చే వ్యాధులు ఇవే!…

Computer

Computer Work : టెన్నాలజీ యుగం రాకతో అంతా కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతో తమ రోజు వారి కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఒకరకంగా వీటి వినియోగం మనకు అవసరమే అయినప్పటికీ అదేపనిగా వాటికే అతుక్కుపోవటం వల్ల మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ప్రస్తుతం వీటిని వినియోగించనిదే రోజు గడవని పరిస్ధితి నెలకొంది. ఈ నేపధ్యంలో వీటి వల్ల వచ్చే వ్యాధుల గురించి అవగాహన కలిగి ఉండటం కూడా ఎంతో అవసరం. గంటల తరబడి కంప్యూటర్లకు పరిమితం కావటం వల్ల మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది .

ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను ఆఫీస్‌ నీ గా వర్ణిస్తున్నారు. కదలకుండా కూచొని పనిచేయటం ఊబకాయానికి దారితీస్తుంది. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తుంది. ఊబకాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎడతెరిపిలేకుండా టైప్‌ చేయడం, అతి ఎక్కువ సమయం టైప్‌ చేయడం, తల తిప్పకుండా పనిచేయడం, మణికట్టు వంచి పనిచేయడం, అదే పనిగా మౌస్‌ వాడడం, కదలకుండా ఒకేచోట కూర్చొని వుండడం, కాళ్ళ కింద సపోర్ట్‌ లేకుండా కూర్చోవడం, అతి తక్కువ లేక అతి ఎక్కువ కాంతిలో పనిచేయడం వంటి వాటి వల్ల రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజ్యూరీ (ఆర్ఎస్ఐ) సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టు కోల్పోవడం, చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతి మధ్య నుండి మణికట్టు ద్వారా వెళ్ళే నరంపై ఒత్తిడి పెరగడం వల్ల చేతిలో సూదులతో గుచ్చుతున్నట్లుగా బాధ కలగడం, స్పర్శజ్ఞానం కోల్పోవడం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలతో కూడిన కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (సిటిఎస్) సమస్యలు ఉత్పన్నమౌతాయి.  భుజాలు, మెడలోని కండరాలు, అరికాళ్ళు, మోకాళ్ళు, నడుముభాగంలో ఈ వ్యాధి లక్షణాలు.

కళ్ళు పొడిబారతాయి. నొప్పిగాను, దురదగాను అనిపిస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కళ్ళమంట, కళ్ళు తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కళ్ళు మసకబారడం వంటివి ఈ సివిఎస్‌ లక్షణాలు. కంప్యూటర్‌ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ల్యాప్‌టాప్‌ వాడేవారికి టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌ అనే చర్మవ్యాధి సోకే ప్రమాదం వుంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని స్విస్‌ అధ్యయనం గుర్తించిందని టెలిగ్రాఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్‌ నుంచి వేడి వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్‌ బసెల్‌లో దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్‌ అన్‌డ్రెస్‌ అర్నాల్డ్‌ పీటర్‌ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా వుందని ఆయన పేర్కొన్నారు.

జాగ్రత్తలు ముఖ్యం…

మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది. పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి, కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి. సాధారణంగా మోనిటర్‌ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 2నుంచి 3అంగుళాలు కిందికి వుండాలి.

ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి. కంప్యూటర్‌ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి. కాళ్ళకి కూడా సపోర్ట్‌ గా ఫుట్ రెస్ట్ ఉపయోగించాలి. కంటిన్యూగా వర్క్ చేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మార్చటం మంచిది.