Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల రుచి పెరుగుతుంది. రకరకాల రుచులను తెలుపుతుంది. ప్రతి ఒక్కరికీ 10 వేల టేస్ట్‌బడ్స్ ఉంటాయి. ఇవి ప్రతి రెండువారాలకు రీప్లేస్ అవుతూ ఉంటాయి.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

Tongue

Tongue Color : మనిషి శరీర బాగాల్లో ఒకటైన నాలుక రుచికోసమే కాదు, శరీరంలో ఏర్పడే వివిధ రకాల రుగ్మతలను ఇట్టే తెలియజేస్తుంది. చిన్నతనంలో మనం డాక్టర్‌ వద్దకు వెళ్ళిన సందర్భంలో నాలుక బయటకు చాపి పరిశీలించటం మనం చూసే ఉంటాం. ఇలా ఎందుకు చేస్తుంటారంటే మన శరీరంలో వ్యాధులకు సంబంధించిన లక్షణాలను నాలుకను పరిశీలించటం ద్వారానే చెప్పవచ్చు. మన నాలుక రంగు మన ఆరోగ్యం గురించి చాలా చెబుతుంది. నాలుక రంగును చూసి వైద్యులు వ్యాధిని నిర్ధారిస్తారు.

నాలుకలోని రక్త నాళాలు లాలాజలమును సమృద్ధిగా సరఫరా చేస్తూ నిరంతరం ప్రవహించే విధంగా చేస్తాయి. ఈ విధంగా నాలుక నిరంతరం శుభ్రం చేస్తుంది. అందువలన హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన నాలుక రంగు పింక్ రంగులో ఉంటుంది. చాలా సార్లు, మనం తినే ఆహారం కారణంగా నాలుక రంగు మారుతుంది. అదే ఇతర సమయాల్లో ఆరోగ్య సమస్యను సూచిస్తుంది.

పసుపు నాలుక: మీ నాలుక పసుపు రంగులోకి మారడం ప్రారంభించినప్పుడు, ఇది పోషకాహారం కొరతను సూచిస్తుంది మరియు జీర్ణవ్యవస్థలో ఆటంకాలు, కాలేయం లేదా కడుపు సమస్యలు పసుపు నాలుకకు కారణం కావచ్చు. నాలుక ఉపరితలంపై పాచిపేరుకుని ఉండటం వల్ల, నోటి పరిశుభ్రత లేకపోవడం వలన సంభవిస్తుంది.

నల్ల నాలుక: చైన్ స్మోకర్ల నాలుక నల్లగా మారడం ప్రారంభమవుతుంది. క్యాన్సర్, అల్సర్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ విషయంలో కూడా ఇది జరుగుతుంది. నోటి పరిశుభ్రత లేకపోవడం నాలుకపై బ్యాక్టీరియా ఏర్పడటానికి దారితీస్తుంది, దీని కారణంగా నాలుక రంగు నల్లగా మారుతుంది. స్మోకింగ్, ఎక్కువగా కాఫీ త్రాగటం వంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ పరిస్థితికి దోహదపడతాయి.

తెల్లని నాలుక: ఇది మీ నోటి పరిశుభ్రత తక్కువగా ఉందని మరియు మీ శరీరం డీహైడ్రేషన్‌లో ఉందని సూచిస్తుంది. నాలుకపై పూత కాటేజ్ చీజ్ పొరలా కనిపిస్తే, మీరు కూడా ల్యూకోప్లాకియాని కలిగి ఉండవచ్చు. కొన్నిసార్లు ఫ్లూ కారణంగా నాలుక రంగు తెల్లగా మారుతుంది. నాలుక ఉపరితల కణాలు అదనపు పెరుగుదల,ధూమపానం వంటివి తెలుపు నాలుకకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. నీరు పుష్కలంగా త్రాగటం, మంచి నోటి పరిశుభ్రత నిర్వహించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.

ఎరుపు నాలుక: మీ నాలుక రంగు విచిత్రంగా ఎరుపుగా మారడం ప్రారంభించినట్లయితే, అప్పుడు శరీరంలో ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B-12 లోపం ఉండవచ్చు. నాలుకపై ఎర్రటి మచ్చ కనిపిస్తే దానిని జియోగ్రాఫిక్ టంగ్ అంటారు. మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే అసాధారణ వేడి వలన రుచి మొగ్గలలో వాపు కనిపిస్తుంది

నీలిరంగు నాలుక: నీలం లేదా ఊదారంగు నాలుక అంటే మీకు గుండె సంబంధిత సమస్యలు ఉండవచ్చు. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోయినప్పుడు లేదా రక్తంలో ఆక్సిజన్ తగ్గడం ప్రారంభించినప్పుడు, నాలుక రంగు నీలం లేదా ఊదా రంగులోకి మారుతుంది.

బ్రౌన్ నాలుక: కెఫిన్ తీసుకునే వ్యక్తులు గోధుమ రంగు నాలుకను కలిగి ఉండవచ్చు. ధూమపానం కూడా గోధుమ నాలుకకు కారణమవుతుంది.

అలాగే నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామెర్లు, రక్తహీనత, శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా కావచ్చు. నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు. నాలుక వాపు అనేది ఒక లక్షణం. నాలుక వాచినప్పుడు తినడానికి, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాలుక వాయడంతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారుతుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం.

నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల రుచి పెరుగుతుంది. రకరకాల రుచులను తెలుపుతుంది. ప్రతి ఒక్కరికీ 10 వేల టేస్ట్‌బడ్స్ ఉంటాయి. ఇవి ప్రతి రెండువారాలకు రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నాలుకను శుభ్రపరుచుకోకుంటే టేస్ట్‌బడ్స్ బ్లాక్ అవుతాయి. దీంతో రుచి తెలియదు. రోజుకు రెండుసార్లు బ్రెష్ చేసి నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేసి, దుర్వాసన రాకుండా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇలా చేయకుంటే బ్యాక్టీరియా పెరిగిపోయి చిగుళ్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.