Kidney Stones : కిడ్నీల్లో రాళ్ళు ఎందుకొస్తాయంటే?

విటమిన్ సి, కాల్షియం సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. కిడ్నీలు రక్తంలో నుంచి జల్లెడ పట్టిన ఖనిజాలు, ఆమ్ల లవణాలు ఒకదానికొకటి కలసి గట్టిపడి రాళ్లలా మారిపోతాయి.

10TV Telugu News

Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు.. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు అయిన కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా.. నడుము ప్రాంతంలో వెన్నెముకకు ఇరువైపులా మూత్ర పిండాలు ఉంటాయి.

వీటిలో నెఫ్రాన్లు అని పిలిచే అతి చిన్న ఫిల్టర్లు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. ఒక్కో నెఫ్రాన్ లో గ్లోమెరులస్, ట్యూబ్యుల్ అనే రెండు భాగాలు ఉంటాయి. కిడ్నీల్లోని నెఫ్రాన్ల ద్వారా రక్తం సరఫరా అయినప్పుడు.. తొలుత గ్లోమెరులస్ రక్తంలోని విషపదార్థాలను, పలు రకాల రసాయనాలు, ద్రవ పదార్థాలను జల్లెడ పడుతుంది. తర్వాత వీటిని ట్యూబ్యుల్ మరోసారి జల్లెడ పట్టి శరీరానికి అవసరమైన మినరల్స్ ను సంగ్రహిస్తుంది. తరువాత తిరిగి రక్తంలోకి పంపుతుంది. ఇక వ్యర్థాలు మూత్రం రూపంలో యుటెరరీ నాళాల ద్వారా ప్రవహించి మూత్రాశయంలో నిల్వ అవుతాయి. తర్వాత మూత్ర నాళం ద్వారా బయటకు పంపబడతాయి.

విటమిన్ సి, కాల్షియం సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. కిడ్నీలు రక్తంలో నుంచి జల్లెడ పట్టిన ఖనిజాలు, ఆమ్ల లవణాలు ఒకదానికొకటి కలసి గట్టిపడి రాళ్లలా మారిపోతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రాళ్లుంటే మిగతా వారికీ ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇక ఇంతకు ముందు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడిన వారికి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ రాళ్లు వస్తాయి. శరీరానికి తగినంత మోతాదులో నీరు అందకపోవడం వల్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

అలాగే కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు కనీసం మూత్ర విసర్జన కూడా సరిగా చేయలేరు. మరియు ఈ సమయంలో వచ్చే నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. అందుకే కిడ్నీల్లో రాళ్లును కరిగించడంగారి ,ఆపరేషన్ చేయించుకుని తీయించుకోవడమో చేస్తుంటారు. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. సోడియం అధికంగా ఉన్న ఆహారం ఎప్పుడూ తీసుకోరాలేదు. ఎందుకంటే.. అలాంటి ఆహారం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. యూరిక్‌ ఆసిడ్ ఎక్కువగా ఉన్న వారు మాంసాహారాన్ని అధికంగా తీసుకోరాదు. వారానికి కేవలం ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోవాలి.

విటమిన్ డి ఎక్కువగా తీసుకున్నా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. మరియు చిరుతిండ్లు, ఫాస్ట్ ఫుడ్‌, బేకరీ ఫుడ్స్, శీతల పానీయాలు వంటివి తీసుకోవడం కూడా కిడ్నీల్లో స్టోన్స్ రావడానికి కారణం. కాబట్టి, ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు నీరు ఎక్కువగా తీసుకోవాలి. నీరు మాత్రమే కాదు మజ్జిక, కొబ్బరి నీరు వంటివి కూడా తీసుకోవాలి. అలాగే కిడ్నీ బీన్స్, మెంతులు, తులసి ఆకులు, దానిమ్మ, ఆపిల్ సైడర్ వినెగర్ వంటివి తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి. అలాగే నిమ్మ, బత్తాయి, కమలా వంటి నిమ్మ జాతి పండ్లను కూడా తీసుకోవాలి. ఎందుకంటే, వీటిలో నుంచి వచ్చే సిట్రేట్‌ కిడ్నీల్లో రాళ్లను తగ్గిస్తాయి.

శరీరానికి తగినంత మోతాదులో నీళ్లు అందించటం అవసరం. రోజూ 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగితే రాళ్ల సమస్యకు దూరంగా ఉండొచ్చు. మూత్ర పిండాలు దెబ్బతిన్నవారిలో ఎక్కువ శాతం నీటిని సరిగా తాగకపోవడమో, డీహైడ్రేషన్ సమస్యలకు తరచూ గురై ఉండడమో కారణమని వెల్లడైంది.