టాలీవుడ్‌లో విషాదం, సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత, బాత్‌రూమ్‌లో గుండెపోటు

  • Published By: naveen ,Published On : September 8, 2020 / 08:15 AM IST
టాలీవుడ్‌లో విషాదం, సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత, బాత్‌రూమ్‌లో గుండెపోటు

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ సీనియర్ నటుడిని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. మంగళవారం(సెప్టెంబర్ 8,2020) తెల్లవారుజామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ లు నిలిచిపోవడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

స్వస్థలం కర్నూలు జిల్లా:
1946 మే 8 న కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని సిరివెళ్ల గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జయప్రకాష్ రెడ్డి జన్మించారు. కాగా, ఆయన గుంటూరులో సెటిల్ అయ్యారు. సినిమాల్లో అరుదైన పాత్రలు పోషించిన ఆయన నాటక రంగం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన ఎస్ఐగా పనిచేశారు. బ్రహ్మపుత్రుడుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. పలు నాటకాల్లోనూ నటించారు.

ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు, ఖైదీ నంబర్ 150, జై సింహా, రాజా ది గ్రేట్‌ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి.. చివరిసారిగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో కనిపించారు.
https://10tv.in/nandyala-dental-doctor-madhavi-latha-suicide-case-police-reveals-suicide-note/
రాయలసీమ స్లాంగ్ లో విలనిజంతో అదరొట్టారు:
కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాష్ రెడ్డి. ముఖ్యంగా ఆయన రాయలసీమ మాండలీకానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. రాయలసీమ స్లాంగ్ లో విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు ఆయన బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి ఇక లేరు అనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ రంగానికి చెందిన వారు, అభిమానులు ఆవేదనలో మునిగిపోయారు. జయప్రకాష్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది అన్నారు. ఆయనతో తమకున్న అనుంబంధాన్ని నటీనటులు గుర్తు చేసుకున్నారు.