సోషల్ డ్రామా : దీపికా Chhapaak మూవీపై రభస!

  • Published By: sreehari ,Published On : January 9, 2020 / 12:29 PM IST
సోషల్ డ్రామా : దీపికా Chhapaak మూవీపై రభస!

JNU క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. దీపికా నటించిన (యాసిడ్ బాధితురాలి కథాంశంతో తెరకెక్కిన) Chhapaak మూవీకి నిరసన సెగ తగలింది. దీపికా మూవీని Boycott చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా బుధవారం తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ముందుగా కొందరు సోషల్ మీడియా యూజర్లు, బీజేపీ కార్యకర్తలు సహా #ChhapaakBoycott అంటూ సోషల్ డ్రామాకు తెరదీశారు. తన మూవీ ప్రమోషనల్ స్టంట్ కోసమే దీపికా JNU క్యాంపస్‌కు వెళ్లిందని, దేశద్రోహులకు మద్దతుగా నిలిచిందని ఆరోపిస్తూ ఆమెపై ట్రోల్స్ చేశారు. అయినప్పటికీ సినిమా పరిశ్రమ నుంచి దీపికాకు మద్దతు లభించడమే కాకుండా ఆమె దయ, ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ మాట్లాడుతూ.. ఈ విషయంలో కేవలం సినిమా నటులు మాత్రమే కాదు.. సామాన్యులు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్లి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచవచ్చునని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. దీపికా మూవీకి వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తూ ఆమెపై ట్విట్టర్ లో కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. చాపాక్ మూవీలోని విరోధి మతం, అతడి పేరును నదీమ్ నుంచి రాజేష్ గా మార్చేశారని ఆరోపణలు వచ్చాయి.

2005లో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా Chaapaak మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ పాత్రలో దీపికా నటించింది. నదీమ్ ఖాన్ అనే వ్యక్తి మరో ముగ్గురి వ్యక్తులతో కలిసి ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ దగ్గర బాధితురాలిపై యాసిడ్ పోశాడు. దేశవ్యాప్తంగా ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకిత్తించింది. మూవీని అదే కథనంతో తెరకెక్కిస్తుండగా.. అందులో #LaxmiAgarwal (లక్ష్మి అగర్వాల్) పాత్ర పేరును మాల్తీగా మార్చగా, నదీమ్ పాత్రను మూవీలో Babboo అకా బషీర్ ఖాన్ మారినట్టుగా చూపించారు. కానీ, రాజేష్‌గా కాదు.. మూవీలో మాల్తీ బోయ్ ఫ్రెండ్ రాజేష్ గా చూపించారు.

ఈ స్టోరీ నాదే : బాంబే హైకోర్టులో దావా :
మరోవైపు.. మేఘనా గుల్జార్ (#MeghnaGulzar) దర్శకత్వం వహించిన ఈ చాపాక్ మూవీ స్టోరీ తనదంటూ రచయిత రాకేశ్ భారతీ బాంబే హైకోర్టులో దావా వేశాడు. చాపాక్ స్టోరీ వాస్తవంగా తాను రాసుకున్న కథగా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మూవీ స్టోరీ ముందుగా తానే రాసినందుకు తనకు కూడా క్రెడిట్ ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. వాస్తవ ఘటనల ఆధారంగా రాసిన కథలపై ఏ వ్యక్తి కాపీరైట్ క్లయిమ్ చేసుకోలేరని స్పష్టం చేసింది. కాగా, షెడ్యూల్ ప్రకారం.. #DeepikaBeginsChhapaak మూవీ జనవరి 10 (శుక్రవారం) రిలీజ్ కానుంది.