Taraka Ratna Demise : తారకరత్న మృతికి సీఎంలు జగన్, కేసీఆర్, టీడీపీ చీఫ్ చంద్రబాబు సంతాపం.. లోకేశ్ భావోద్వేగం

తారకరత్న మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మృతితో టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Taraka Ratna Demise : తారకరత్న మృతికి సీఎంలు జగన్, కేసీఆర్, టీడీపీ చీఫ్ చంద్రబాబు సంతాపం.. లోకేశ్ భావోద్వేగం

Taraka Ratna Demise : సినీ నటుడు నందమూరి తారకరత్న(40) కన్నుమూశారు. జనవరి 27న కుప్పంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కొన్ని వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మృత్యువుతో పోరాడి ఓడారు. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

జనవరి 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తారకరత్న కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే, పాదయాత్ర సాగుతుండగా తారకరత్న సడెన్ గా కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుప్పంలో కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి జనవరి 28న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం తారకరత్నకు చికిత్స అందించింది. తారకరత్నను బతికించేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు.

Also Read..Nandamuri Taraka Ratna Passes Away : నందమూరి తారకరత్న కన్నుమూత

తారకరత్న మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తారకరత్న మృతితో టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నందమూరి తారకరత్న మరణవార్త ఎంతో బాధను కలిగించిందన్నారు. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న, చివరికి మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

తారకరత్న మృతికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నా” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

మరోవైపు తార‌క‌ర‌త్న మృతితో లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ నిలిచిపోయింది. తార‌క‌ర‌త్న‌కి నివాళి అర్పించేందుకు లోకేష్ ఆదివారం ఉదయం హైద‌రాబాద్ బ‌య‌లుదేరనున్నారు.

మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఓ దశలో తారకరత్నను విదేశాలకు తీసుకెళతారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత విదేశీ వైద్య నిపుణులనే బెంగళూరు రప్పించారు. అంతేకాదు, తారకరత్నను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తారంటూ శనివారం ప్రచారం జరిగింది. కానీ అందరినీ విషాదంలో ముంచుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. 23 రోజులుగా ఆయనను బతికించేందుకు డాక్టర్లు చేసిన కృషి నిష్ఫలమైంది.

Also Read..Taraka Ratna Passes Away : తారకరత్న కన్నుమూత.. సోమవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు

తారకరత్న వయసు 40 ఏళ్లు. ఆయనకు భార్య అలేఖ్యా రెడ్డి, కుమార్తె నిషిక ఉన్నారు. తారకరత్నది ప్రేమ వివాహం. అలేఖ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సతీమణి చెల్లెలు కూతురు. అలేఖ్య టాలీవుడ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసేది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పట్లో కొంతమంది సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.

తారకరత్న 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, విజేత, అమరావతి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్, మహాభక్త సిరియాళ, కాకతీయుడు, ఎవరు, మనమంతా, దేవినేని, సారథి చిత్రాల్లో నటించారు. మొత్తం 23 చిత్రాల్లో హీరో, ప్రతినాయక, క్యారెక్టర్ రోల్స్ పోషించి మెప్పించారు. అమరావతి చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు కూడా దక్కింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.