Rajababu: ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత

తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.

Rajababu: ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత

Rajababu

Rajababu: తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సినీ, టీవీ, రంగస్థల నటుడు రాజబాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 64ఏళ్ల రాజబాబుకు భార్య, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వెండితెరపై గోదావరి జిల్లాల నేపథ్యంలో ఉండే సినిమాల్లో రాజాబాబు ఖచ్చితంగా ఉంటారు. ఇండస్ట్రీలో అందరూ బాబాయ్ అని రాజబాబును ఆప్యాయంగా పిలుస్తారు.

తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదాగా ఉంటారు? తన చుట్టూ ఉన్నవారిని సరదాగా నవ్విస్తుంటారు. రాజబాబు మృతిపై ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రాజబాబు, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేటలో 13 జూన్ 1957లో జన్మించారు. తండ్రి రామతారకం చిత్ర నిర్మాత, నటుడు కూడా. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం “, “రాధమ్మ పెళ్లి ” సినిమాలను నిర్మించారు .

కాకినాడలో స్థిరపడిన రాజబాబుకు వ్యవసాయం చెయ్యడం.. కబడ్డీ ఆడడం చాలా ఇష్టం.. రంగస్థల నటుడుగా ఎన్నో మన్ననలు అందుకుని, నాటకాలు వేస్తూనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వంలో రాజబాబు 1995లో “ఊరికి మొనగాడు” అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అనంతరం సింధూరం సినిమాతో రాజబాబుకు అవకాశాలు ఎక్కువయ్యాయి. దీంతో కాకినాడ నుంచి రాజబాబు హైదరాబాద్‌కు మకాం మార్చి సినిమా రంగంపై దృష్టి పెట్టారు.

సముద్రం, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, మురారి, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను వంటి పాపులర్ సినిమాల్లో నటించారు. మొత్తం 62సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించిన రాజబాబు టీవీ రంగంలోను నటించారు.

వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చిలసౌ స్రవంతి, ప్రియాంక సీరియల్స్‌లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. రాజబాబు 48 సీరియల్స్‌లో విభిన్నమైన పాత్రల్లో నటించారు. 2005వ సంవత్సరంలో “అమ్మ” సీరియల్‌లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది.

Read More:

ఓడిపోయిన మ్యాచ్‌లో రికార్డు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా!

నా దృష్టిలో హీరోలే లేరు.. నా కథలో అంతకన్నా ఉండరు

నేడు ఢిల్లీ‏కి చంద్రబాబు.. వైసీపీ దాడులపై ఫిర్యాదు