ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య హీరోయిన్ డాక్టర్, డ్యాన్సర్, సింగర్, ఆర్టిస్ట్ అని మీకు తెలుసా..

ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య హీరోయిన్ డాక్టర్, డ్యాన్సర్, సింగర్, ఆర్టిస్ట్ అని మీకు తెలుసా..

ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా సెకండ్ పార్ట్ లో కనిపిస్తుందే.. ఓ హీరోయిన్. అదేనండీ విలన్ ఇంటికి వెళ్లిన హీరో సమోసాలు తినేస్తుంది చూడండి. తన అసలు పేరు రూప కొడవయార్. ఈమె వట్టి యాక్టర్ మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్ అండి బాబూ. సుహాసినీ, రాధిక లాంటి వాళ్లను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టేసింది ఈ తెలుగమ్మాయి. చదివేది డాక్టర్ అయినప్పటికీ.. హాబీలను వదలడం లేదు. దేని టైం దానిదేనంటూ దూసుకెళ్లిపోతుంది. కళ్లతోనే కట్టిపడేసే ఆ అందం.. అభినయం డ్యాన్స్ వల్ల వచ్చినవే కాబోలు.. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..



చిన్నపుడు టీవీలో పాటలకు కళ్లను తిప్పుతూ డ్యాన్స్‌ చేసేదాన్నట. అది చూసి అమ్మ సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇప్పించింది. నాలుగేళ్లకే విజయవాడలోని బాలభవన్‌లో అలివేలు మంగతాయారుగారి దగ్గర శిక్షణ తీసుకున్నా. కూచిపూడి, భరతనాట్యం రెండూ నేర్చుకున్నా. ఆ తర్వాత ఘంటసాల పవన్‌కుమార్‌ గారి దగ్గర శిష్యరికం చేశా. ఇప్పటివరకూ రాష్ట్ర, జాతీయస్థాయిలో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్ఛా. కూచిపూడి, భరతనాట్యంలలో డిప్లొమాలు కూడా పూర్తిచేశా.





నాన్న రవికుమార్‌ ఆర్మీలో పనిచేస్తారు. అమ్మ మంగలక్ష్మి సంస్కృతం లెక్చరర్‌. నేను విజయవాడలోని అమలి స్కూల్‌, శ్రీచైతన్య కాలేజీల్లో చదువుకున్నా. ‘ప్రాణం నిలబెట్టే గొప్ప వృత్తి వైద్యం. నువ్వు డాక్టర్‌ అయితే సంతోషిస్తా’ అంటుండేది అమ్మ. అందుకే మెడిసిన్‌ చేయాలనుకున్నా. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సంపాదించి… గుంటూరులోని కాటూరి మెడికల్‌ కాలేజీలో ఫ్రీ సీట్‌ సాధించా. ప్రస్తుతం హౌస్‌సర్జన్సీ చేస్తున్నా.





గత అయిదు నెలలనుంచి హాస్పిటల్‌లో కొవిడ్‌ రోగులకు సేవలు అందిస్తున్నా. డాక్టరుగా వారికి చికిత్స చేయడంతోపాటు సాటి మనిషిగా వాళ్ల బాధల్ని వింటూ ధైర్యం చెబుతా..





‘ఉమామహేశ్వర…’లో హీరోయిన్ల కోసం చూస్తున్నారని తెలిసి నా ప్రొఫైల్‌ పంపా. దర్శకుడు వెంకటేష్‌ మహా, నిర్మాత ప్రవీణ ఆడిషన్‌ చేసి ఎంపికచేశారు. సహనటులు హరిచందన, కుశాలినిలతోపాటు అరకులో పదిరోజులు ఉండి స్థానికుల హావభావాల్ని గమనించా. సత్యదేవ్‌ కూడా కొన్ని టిప్స్‌ ఇచ్చారు. నేను చేసిన ‘జ్యోతి’ పాత్రకు మంచి స్పందన వస్తోంది.
ఫ్లాష్‌మాబ్‌లో డ్యాన్స్‌ బాగా చేశానని అందరూ మెచ్చుకుంటున్నారు. నాలుగున్నర నిమిషాల నిడివి ఉండే ఫ్లాష్‌మాబ్‌ సీక్వెన్స్‌ని సింగిల్‌ షాట్‌లో చేశాం. సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ అవ్వాల్సింది. కరోనా కారణంగా కాలేదు. ఓటీటీలో రిలీజైన రోజు నుంచి చర్చలూ, రివ్యూలూ, సోషల్‌ మీడియాలో పోస్టులూ, మీమ్స్‌తో థియేటర్లో రిలీజైన అనుభూతి కలిగింది..





నాన్న ఆర్టిస్ట్‌. ఆయన స్ఫూర్తితో పెయింటింగ్‌ కూడా వేస్తుంటా. ఇప్పటికీ వారంలో మూడు రోజులైనా డ్యాన్స్‌ ప్రాక్టీసు చేస్తా. ‘సాహోరే బాహుబలి’ పాటకు డ్యాన్స్‌ చేసి వీడియోని నా యూట్యూబ్‌ ఛానెల్‌లో పెట్టా. రెండు లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. విశ్వనాథ్‌గారి సినిమా పాటలకీ డ్యాన్స్‌చేసి వీడియోలను పెట్టాను. వాటికీ మంచి స్పందన వచ్చింది.