అంత్యక్రియలకు వెళ్లిన 18మందికి కరోనా

  • Published By: venkaiahnaidu ,Published On : May 30, 2020 / 12:56 PM IST
అంత్యక్రియలకు వెళ్లిన 18మందికి కరోనా

ఎపిడమిక్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్ టౌన్ లో కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్ళిన 18 మందికి కరోనా సోకింది.  మే-25న 40 ఏళ్ళ మహిళ  కరోనాతో మృతి చెందింది. మహిళ మరణించిన తరువాత ఉల్లాస్‌ నగర్‌ మున్సిపల్‌ అధికారులు ఆమెకు కరోనా టెస్ట్ లు చేయించారు. చనిపోయిన మహిళకు కరోనా ఉందని నిర్ధారణ అవ్వడంతో శవాన్ని ప్యాక్‌ చేసి అంతిమ కర్మల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు.

ప్యాక్‌ చేసిన శవాన్ని తెరవకుండా అంతిమ సంస్కరణలు చేసుకోవచ్చని అధికారులు వారికి తెలిపారు. అయినా అధికారుల ఆదేశాలు బేఖాతరు చేసిన బంధువులు శవాన్ని తెరిచి అంత్యక్రియలు నిర్వహించారు. తక్కువ మందితో పూర్తి చేయాల్సిన అంత్యక్రియలకు ఏకంగా 70 మందికి పైగా హాజరయ్యారు. దీంతో 70 మందికి అధికారులు కరోనా టెస్టులు చేయగా అందులో ఏకంగా 18 మందికి కరోనా సోకినట్లు తెలింది.