5 States Election Results 2021 : బెంగాల్ లో దీదీ హ్యాట్రిక్ విక్టరీ..తమిళనాడులో డీఎంకే గ్రాండ్ విక్టరీ..కేరళలో చరిత్ర తిరగరాసిన ఎల్డీఎఫ్,అసోంలో మళ్లీ బీజేపీ,పాండిచ్చేరిలో బీజేపీ కూటమిదే విజయం

5 States Election Results 2021 : బెంగాల్ లో దీదీ హ్యాట్రిక్ విక్టరీ..తమిళనాడులో డీఎంకే గ్రాండ్ విక్టరీ..కేరళలో చరిత్ర తిరగరాసిన ఎల్డీఎఫ్,అసోంలో మళ్లీ బీజేపీ,పాండిచ్చేరిలో బీజేపీ కూటమిదే విజయం

ఎన్నికల విజేతలు వీళ్లే

Election Results 2021 అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. అయితే, రాజకీయ ప్రముఖులనుంచి సామాన్యుల దాకా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. బీజేపీ లీడర్లందరినీ సింగిల్ ఎదుర్కొన్న మమత..215 స్థానాల్లో టీఎంసీ విజయంతో తన సత్తా చూపించి హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. అయితే, నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారిపై సీఎం మమతాబెనర్జీ ఓటమిపాలవడం టీఎంసీ శ్రేణులను కొంత నిరాశకుగురిచేసింది. బెంగాల్ లో అధికారపగ్గాలు చేపట్టాలనుకున్న బీజేపీకి బెంగాల్ ఓటర్లు భారీ షాక్ నే ఇచ్చారు. ఇక,కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి అడ్రస్ గల్లంతైంది. బెంగాల్ లో దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన కమ్యూనిస్టులను ప్రజలు కన్నెత్తైనా చూడలేదు. వెస్ట్ బెంగాల్ లోని మొత్తం 294 స్థానాలకుగాను..టీఎంసీ 215 స్థానాల్లో విజయం సాధించగా,బీజేపీ 75 స్థానాల్లో విజయం సాధించింది. ఇక,కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి అడ్రస్ గల్లంతైంది.

ఇక, తమిళనాడులో ముందునుంచి అందరూ ఊహించినట్లుగానే డీఎంకే ఘన విజయం సాధించింది. ఇక,మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కమల్ హాసన్ నేతృత్వంలోని ఎమ్ఎన్ఎమ్ పార్టీ..ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఆఖరికి ఎమ్ఎన్ఎమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ సైతం పోటీ చేసిన కోయంబ్తతూరులో బీజేపీ అభ్యర్థిపై వనతి శ్రీనివాసన్ పై 1500ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకుగాను..159 స్థానాల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా,అధికార అన్నాడీఎంకే మాత్రం కేవలం 75స్థానాలకే పరిమితమైంది. ఇక,మరో రెండు మూడు రోజుల్లో తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. డీఎంకే నుంచి కురుణానిధి తర్వాత సీఎం అవబోతున్న మొదటివ్యక్తి కూడా స్టాలినే.

కేరళలో చరిత్రను తిరగరాసింది పిన్నరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్. కేరళలో గత 40 ఏళ్లుగా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికారం మారుతుంది. ఒకసారి ఎల్డీఎఫ్ గెలిస్తే.. మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మరోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకుంది. కేరళలో నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. మొత్తం 140 స్థానాలకుగాను…ఎల్డీఎఫ్ 99స్థానాల్లో విజయం సాధించగా,కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేవలం 41 స్థానాలకే పరిమితమైంది. ఇక,బీజేపీకి కేరళలో భంగపాటు తప్పలేదు. ఒక్కస్థానాన్ని కూడా బీజేపీ దక్కించుకోలేకపోయింది.

అసోంలో బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారాన్ని నిలుపుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అసోంలో నిరసనలు వెల్లువెత్తినా రాజకీయంగా ఈ అంశం పెద్దగా ప్రభావం చూపకపోవడం కాషాయపార్టీకి కలిసివచ్చింది. మొత్తం 126 స్థానాలకుగాను బీజేపీ కూటమి 75 స్థానాల్లో విజయం సాధించగా..కాంగ్రెస్ కూటమి 50 స్థానాల్లో విజయం సాధించింది. కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వం, ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ కృషి చేయడం కూడా బీజేపీ గెలుపునకు దోహదపడింది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ తో పాటు రెండు దశాబ్ధాల రాజకీయ అనుభవం కలిగిన హిమంత బిశ్వ శర్మ జోడీ కూడా ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఉపకరించింది. ఈ జోడీకి దీటైన ప్రత్యర్ధిని కాంగ్రెస్‌ కూటమి ప్రజల ముందుకు తీసుకురాలేకపోవడం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది.

ఇక,పాండిచ్చేరిలో కూడా కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాండిచ్చేరిలో మొత్తం 30 స్థానాలకుగాను బీజేపీ కూటమి 16 స్థానాల్లో విజయం సాధించగా,డీఎంకే-కాంగ్రెస్ కూటమి 9స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 5స్థానాల్లో విజయం సాధించారు.