#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్ల పాలన.. మోదీ సాధించిన 5 అతిపెద్ద విజయాలు ఇవే..

మోదీ ప్రభను మరింత పెంచాయి ఈ 5 అతిపెద్ద విజయాలు.

#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్ల పాలన.. మోదీ సాధించిన 5 అతిపెద్ద విజయాలు ఇవే..

Narendra Modi

Narendra Modi: భారత 14వ ప్రధాన మంత్రిగా 2014 మే 26న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ప్రభను మరింత పెంచిన 5 అతిపెద్ద విజయాలు ఏంటో చూద్దాం..

వస్తు, సేవల పన్ను (GST): దేశ ఆర్థిక చరిత్రలో సరికొత్త అధ్యాయం జీఎస్టీ. దేశంలోని రాష్ట్రాల్లో పలు విధాలుగా ఉన్న పన్నుల స్థానంలో ఏకీకృత పన్నును మోదీ హయాంలో ప్రవేశపెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం జరిగిన అత్యంత భారీ పన్ను సంస్కరణగా జీఎస్టీ నిలిచింది. దీనికి మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో బీజం పడింది.

యూపీఏ హయాంలో ప్రవేశపెట్టాలనుకోగా, అది ముందుకు వెళ్లలేదు. అధికార, విపక్షాల మధ్య విభేదాలతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉండిపోయింది. చివరకు మోదీ పాలనలో 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది. విపక్షాలను ఒప్పించడం, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జీఎస్టీని ముందుకు తీసుకెళ్లడం మోదీ వల్లే సాధ్యమైంది.

అయోధ్యలో రామమందిరం: హిందువుల దశాబ్దాల కల అయోధ్యలో రామమందిర నిర్మాణంపై మోదీ 2014 లోక్ సభ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోతో పాటు 2019 మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చారు. రామమందిర అంశం సుప్రీంకోర్టులో ఉన్న విషయం అయినప్పటికీ మందిర నిర్మాణానికి మోదీ హయాంలోనే అనుకూలంగా తీర్పురావడంతో మోదీ ప్రభ మరింత పెరిగింది. అనంతరం రామమందిర నిర్మాణానికి మోదీ చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది.

యూపీ, ఇతర రాష్ట్రాల ఎన్నికలు: దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మోదీ హవాతోనే 2017లో బీజేపీ ఏకంగా 312 స్థానాల్లో గెలుపొందింది. 2022లో జరిగిన ఎన్నికల్లోనూ 255 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అంతేకాదు, మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందింది. మోదీ ప్రభ మరింత పెరిగింది.

2019 లోక్‌సభ ఎన్నికలు: మోదీకి మళ్లీ దేశ ప్రజలు ఓట్లు వేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల ద్వారా దొరికింది. ఏకంగా 303 సీట్లు బీజేపీ సాధించింది. 2014లో సాధించిన (282) సీట్ల కంటే ఎక్కువగా మోదీ సంపాదించుకోవడం గమనార్హం. మోదీ సాధించిన అతిపెద్ద విజయంగా 2019 లోక్‌సభ ఎన్నికలను చెప్పుకోవచ్చు.

విదేశీ పర్యటనలు: మోదీ విదేశీ పర్యటనల ద్వారా ప్రపంచంలో భారత్ పేరే కాకుండా న.మో ప్రభ కూడా పెరిగింది. 2016 జూన్ లో యూఎస్ కాంగ్రెస్ లోనూ మోదీ ప్రసంగించారు. అనేక అంతర్జాతీయ వేదికలపై భారత వాణిని వినిపించారు. అనేక దేశాలతో స్నేహబంధాన్ని పెంచుకున్నారు. భారత్ నుంచి మోదీ మొత్తం విదేశాలకు 68 సార్లు వెళ్లారు.

9 ఏళ్లలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు
నరేంద్ర మోదీ ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఆయన ప్రభను మరింత పెంచాయి. ఇటీవలే మోదీ… ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ తో సత్కరించిన విషయం తెలిసిందే. అదే రోజు పాపువా న్యూ గినియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ మోదీకి ప్రదానం చేసింది.

అలాగే, 2021లో ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ ను మోదీకి ప్రధానం చేసింది భూటాన్. 2016 నుంచి 2023 మే మధ్య మోదీ మొత్తం 11 దేశాల పురస్కారాలు అందుకున్నారు. అందులో అమెరికా “లెజియన్ ఆఫ్ మెరిట్” పురస్కారం, రష్యా ప్రదానం చేసిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ కూడా ఉన్నాయి.

#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్ల పాలనలో మోదీకి ఎదురైన 5 అతిపెద్ద సవాళ్లు, తీవ్ర విమర్శలు..